iDreamPost
android-app
ios-app

గద్ద ప్రాణం కాపాడబోయి.. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు

  • Published Jun 10, 2022 | 11:38 AM Updated Updated Jun 10, 2022 | 11:38 AM
గద్ద ప్రాణం కాపాడబోయి.. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు

గద్ద ప్రాణాన్ని కాపాడబోయి.. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు పోగొట్టుకున్న విషాద ఘటన దేశ ఆర్థికరాజధాని ముంబై నగరంలోని బాంద్రా-వర్లి సముద్రపు వంతెనపై చోటుచేసుకుంది. మే 30న జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అమర్ మనీష్ జరీవాలా (43) మలద్ కు కారులో వెళ్తున్నారు. బాంద్రా-వర్లి సీ లింక్ పై వెళ్తుండగా.. ఓ గద్ద ఉన్నట్లుండి తమ కారుకింద చిక్కుకుపోయింది. దాంతో కారు ఆపాలని డ్రైవర్ శ్యామ్ సుందర్ ను అమర్ కోరాడు.

ఇద్దరూ కారు దిగి.. కారుకింద చిక్కుకుపోయిన గద్దను ఎలా కాపాడాలా అని ఆలోచిస్తుండగానే.. వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఇద్దరినీ ఢీ కొట్టి వెళ్లిపోయింది. కారు వేగానికి ఇద్దరూ రోడ్డుకు చెరోవైపు ఎగిరిపడ్డారు. అమర్ అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన డ్రైవర్ శ్యామ్ సుందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ప్రమాదాన్ని ఓ సందర్శకుడు తన కెమెరాలో చిత్రీకరించగా.. ప్రమాదానికి కారణం ట్యాక్సీ డ్రైవర్ నిర్లక్ష్యమేనని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘటనకు కారణమైన టాక్సీ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.