Idream media
Idream media
బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మొదటి నుంచీ వార్ నడుస్తూనే ఉంది. ఆయనను తొలగించాలని మమత ఎన్నికల ముందు నుంచీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంది. మూడు సార్లు లేఖలు కూడా రాసింది. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసపై గవర్నర్ మమత ప్రభుత్వంపై ట్విటర్ లో దుయ్యబట్టారు. ఇప్పుడు గవర్నర్ పై మమత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన అవినీతిపరుడని, జైన్ హవాలా కేసులో ఆయనపై ఛార్జి షీట్ నమోదైందని పేర్కొనడం రాజకీయాల్లో కలకలం రేపింది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న తనపై మమత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని జగదీప్ ఖండిస్తున్నారు. దీనిపై తగు చర్యలకు న్యాయ నిపుణులతో సంప్రదిస్తానడంతో వారి మధ్య వార్ ముదిరిపాకాన పట్టనున్నట్లు కనిపిస్తోంది.
బెంగాల్ లో సీఎం, గవర్నర్ ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇద్దరూ ఉప్పూ నిప్పుల చిటపటలాడుతూనే ఉంటారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తో ఢీ అంటే ఢీ అంటున్న మమతా బెనర్జీని.. కేంద్రం నియమించిన గవర్నర్ ప్రతీసారి అడ్డుకుంటూనే ఉంటున్నారు. తాజాగా మరోసారి వీరి మధ్య వివాదం చెలరేగింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. సీఎం మమత ఆరోపణలతో తాను షాక్ కు గురయ్యానని వాపోయారు. గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్ పై మమతా తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. గవర్నర్ పచ్చి అవినీతి పరుడు అని మమతా బెనర్జీ ఆరోపించడం సంచలనమైంది. బెంగాల్ విభజనకు కుట్రపన్నుతున్నారని విమర్శించారు.
మమత మాట్లాడుతూ 1996 లో జైన్ హవాలా కేసులో ఆయనపై ఛార్జ్ షీట్ దాఖలైందన్నారు. మాకు భారీ మెజారిటీ వచ్చినా మా ప్రభుత్వం మీద ఆయన పెత్తనమేమిటని ఆమె ప్రశ్నించారు. 1990 ప్రాంతంలో జైన్ డైరీస్ కేసుగా హవాలా కుంభకోణం నాడు పతాక శీర్షికలకెక్కింది. జైన్ బ్రదర్స్ పేరిట నలుగురు హవాలా బ్రోకర్ల ద్వారా రాజకీయ నాయకులకు భారీగా చెల్లింపులు జరిగాయని నాటి వార్తలు తెలిపాయి. ఈ స్కామ్ తో పలువురు బడా పొలిటికల్ లీడర్లకు లింక్ ఉండేదట. ఇది 18 మిలియన్ డాలర్ల స్కాండల్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాగా జగదీప్ ధన్ కర్ ని తొలగించాలని తృణమూల్ కాంగ్రెస్ ఏ నాటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండుపై మమతా బెనర్జీ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీతో బాటు ఇతర నేతలతో కూడా చర్చలు జరిపారు.
ఇక తన పాత కేసులు తవ్వుతున్న మమతా బెనర్జీ తీరుపై గవర్నర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై సీఎం ఇలా విరుచుకుపడడం ఏంటని వాపోయారు. మమత చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా ఆరోపించడం తానెప్పుడూ చూడలేదన్నారు. మమతా బెనర్జీ ఆరోపనలపై గవర్నర్ వివరణ ఇచ్చారు. ఏ చార్జీషీట్ లోనూ తన పేరు లేదన్నారు. ఏ కోర్టు నుంచి కూడా తాను స్టే తీసుకోలేదన్నారు. సీఎం మమతా నుంచి ఇలాంటి ఆరోపనలు ఊహించలేదని వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణలు తనకు షాక్ కు గురి చేశాయన్నారు. ఇలా టామ్ అండ్ జెర్రీలా వీరి ఫైట్ బెంగాల్ లో రాజకీయ వేడిని రగిలిస్తోంది.