iDreamPost
iDreamPost
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెసును విస్తరించాలన్న లక్ష్యసాధనకు స్వయంగా ఆ పార్టీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రంగంలోకి దిగారు. తన కార్యాచరణలో మొదటిగా కేంద్రపాలిత ప్రాంతం గోవాను టార్గెట్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా అక్కడ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఆమె గోవా చేరుకున్నారు. మూడు రోజులు అక్కడే మకాం వేసి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి కూటమి ఏర్పాటులో కాంగ్రెస్ విఫలమైందని టీఎంసీ అధికార పత్రిక జాగో బంగ్లా విమర్శిస్తూ వ్యాసం ప్రచురించింది. మమతా గోవా పర్యటన సమయంలోనే కాంగ్రెసును విమర్శిస్తూ వ్యాసం ప్రచురితం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాంగ్రెస్, బీజేపీలను దెబ్బకొట్టడానికే..
జాతీయ స్థాయిలో బీజేపీని దెబ్బ తీయాలన్నది మమతా మొదటి నుంచీ పెట్టుకున్న లక్ష్యం.. ఇప్పుడు కాంగ్రెసును కూడా టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గోవాపై కన్నేసిన మమతా ఆ రాష్ట్రంలో ప్రజాబలం ఉన్న బలమైన కాంగ్రెస్, బీజేపీ నేతలతో మంతనాలు జరిపి తమ పార్టీలో చేర్చుకోవడానికే ఆమె గోవాలో మూడు రోజులు మకాం వేస్తున్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసుతో దశాబ్దాల అనుబంధం ఉన్న లుజిన్ ఫెలీరో తృణమూల్లో చేరారు. వివిధ పార్టీలకు చెందిన చాలామంది ఈ మధ్య కాలంలో టీఎంసీలో చేరారు. ఎన్నికల్లో సత్తా చాటేలా పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు మమత ప్రయత్నిస్తున్నారు. అలాగే టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ పాక్ బృందం కూడా గోవాలో తన పని మొదలుపెట్టింది.
కాంగ్రెసుపై విసుర్లు
మమతాబెనర్జీ గోవా పర్యటన సందర్భంలోనే తృణమూల్ అధికార పత్రిక జాగో బంగ్లా కాంగ్రెసుపై విమర్శలతో వ్యాసం ప్రచురించడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి నిర్మాణంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమైందని విమర్శించింది. ఆ పార్టీ ట్విట్టర్ కే పరిమితమైందని వ్యాఖ్యానించింది. కాంగ్రెసు లేకుండా కొత్త కూటమి ఏర్పడాలని టీఎంసీ ఎప్పుడు చెప్పలేదని.. పొత్తు, స్టీరింగ్ కమిటీ, విధానం, కార్యాచరణ ప్రణాళిక వంటివి రూపొందించాలని కోరాం.. కానీ ఇప్పటికీ అవేవీ ఆచరణలోకి రాలేదని విమర్శించింది. బీజేపీకి తగిన ప్రత్యామ్నాయం కోసం తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.
Also Read : Will Not Let Farmers Die By Suicide – మంచి మాట కేజ్రీవాల్… అదే జరిగితే దేశం మీకు జై కొడుతుంది..