వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు కొద్దిరోజులుగా వేడెక్కుతున్న విషయం తెలిసిందే. బెంగాల్ ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో తెలుగు ప్రజలకు మమత సర్కారు తీపి కబురు అందించింది. పశ్చిమ బెంగాల్‌లో తెలుగు భాషను అధికార భాషగా గుర్తిస్తూ మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా బెంగాల్‌లో ఉన్న తెలుగు ప్రజలను భాషాపరమైన మైనారిటీలుగా గుర్తించారు.
పశ్చిమబెంగాల్లో బెంగాలీతో పాటు హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒడియాకుతో కలిపి పది భాషలు అధికారిక భాషలుగా గుర్తింపు పొందాయి. తెలుగును కూడా అధికార భాషగా గుర్తించాలని ఎప్పటినుంచో వలసవెళ్లిన తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేబినెట్ సమావేశంలో తెలుగును అధికార భాషగా గుర్తించడంతో వారి డిమాండ్ నెరవేరింది.
ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌లో స్థిరపడిన తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకే మమత బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అనేకమంది తెలుగు ప్రజలు ఉద్యోగాల నిమిత్తం పశ్చిమ బెంగాల్‌కి వలసవెళ్లి అక్కడే నివసిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ ప్రాంతంలో ఎక్కువ మంది తెలుగు వారు నివసిస్తున్నారు. అంతేకాకుండా స్థానిక రాజకీయాల్లో వలస వెళ్లిన తెలుగుప్రజలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఖరగ్‌పూర్ మునిసిపాలిటీలోని 35 వార్డుల్లో ఆరుగురు తెలుగువాళ్లే కౌన్సిలర్లుగా ఉండటం గమనార్హం. తెలుగు ప్రజలు ఎక్కువగా నివశిస్తున్నందున అందుకే ఖరగ్‌పూర్‌ను మినీ ఆంధ్రాగా పిలుస్తారు. మమత బెనర్జీ తీసుకున్న తాజా నిర్ణయంతో బెంగాల్‌లోని తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.