iDreamPost
iDreamPost
కోరుకున్నంతనే పదవులు రాలేదని వగచే కంటే.. ఓపికగా నిరీక్షిస్తే ఫలితం లభిస్తుందని.. నిరాశతో కుంగిపోకుండా పట్టుదలతో పనిచేస్తే.. కాస్త ఆలస్యమైనా గుర్తింపు లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఉదంతం నిరూపిస్తోంది.
ఒకసారి పోటీ చేసే అవకాశం రాక.. ఇంకోసారి అవకాశం లభించినా గెలుపు తీరం చేరలేకపోయినా ఆయన నిరుత్సాహంతో కుంగిపోలేదు. పట్టుదలగా పనిచేశారు. పార్టీపై నమ్మకం పెట్టుకొని.. పార్టీ పటిష్టానికి కృషి చేశారు. ఆ అంకితభావం.. ఆ నిరీక్షణను పార్టీ నాయకత్వం గుర్తించింది. ఇటీవలి నామినేటెడ్ నియామకాల్లో రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి ఇచ్చి సముచితంగా గౌరవించింది. పార్టీని నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగనివ్వబోమని ఈ నియామకం ద్వారా పార్టీ నాయకత్వం సంకేతాలు పంపింది. ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా మళ్లను నియమించి మళ్లీ వెలుగునిచ్చింది.
వైఎస్ ద్వారా రాజకీయాల్లోకి
విశాఖ నగరానికి చెందిన మళ్ల విజయప్రసాద్ మొదట వాణిజ్యవేత్త. వెల్ఫేర్ గ్రూపును ప్రారంభించి సినిమాల నిర్మాణంతోపాటు విద్యాసంస్థలు, భూముల విక్రయాలు.. తదితర కార్యకలాపాలు నిర్వహిస్తూ నగరంలో ప్రముఖుడిగా మంచి గుర్తింపు పొందారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో ఆయన సమక్షంలోనే కాంగ్రెసులో చేరారు. 2009 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు.
వైఎస్ అకాల మరణం, రాష్ట్ర విభజన తదితర పరిణామాల నేపథ్యంలో 2014లో జగన్మోహనరెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపీలో చేరారు. వెంటనే పార్టీ ఆయన్ను విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. 2014 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించకపోయినా కష్టపడి పనిచేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడంతో.. జిల్లా అధ్యక్ష పదవికి మళ్ల రాజీనామా చేశారు. అయితే పార్టీ ఆయన్ను విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది.
కష్టానికి తగిన ఫలితం
సమన్వయకర్తగా పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పటిష్టానికి మళ్ల విశేష కృషి చేశారు. విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల్లోనే ఉన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సొంత వనరులతో ప్రారంభించిన పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయ భావన నిర్మాణాన్ని అన్ని హంగులతో పూర్తి చేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ వెస్ట్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసినా దురదృష్టం వెంటాడింది. మళ్ల ఓటమి పాలయ్యారు. అయినా కుంగిపోకుండా సమన్వయకర్తగానే కొనసాగుతూ.. పార్టీ కోసం మరింత కష్టపడ్డారు.
గత ఏడాదికి పైగా కోవిడ్ సంక్షోభంలో కార్యకర్తలు, ప్రజలకు అండగా ఉంటూ పలు సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ బాధితులకు వైద్య, ఇతరత్రా సాయం సకాలంలో అందేలా పర్యవేక్షించారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ జీవీఎంసీ ఎన్నికలకు సిద్ధం చేశారు. ఫలితంగా మార్చిలో జరిగిన ఆ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 14 డివిజన్లకు గాను 10 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులనే కార్పొరేటర్లుగా గెలిపించుకొని సత్తా చాటారు. పదవి లేకపోయినా నాయకత్వాన్నే నమ్ముకొని ఆయన చేసిన కృషి ఫలించింది. సుదీర్ఘ నిరీక్షణకు సముచిత ప్రతిఫలం లభించింది.