iDreamPost
android-app
ios-app

మసిపూసి మారేడుకాయ చేయడం

మసిపూసి మారేడుకాయ చేయడం

అనగనగా ఓ అడవి.. ఆ అడవికి శిఖర్ అనే సింహం రాజుగా ఉంది. ఆ శిఖర్ పరిపాలనలో అధములు అనే మిగతా జంతువులన్నీ సంతోషంగా జీవిస్తూండేవి…ఇలా ఉండగా ఒకానొకరోజు “మహోదర” అనే అనకొండ శిఖర్ వద్దకు వచ్చి అధములందరిముందూ.. తాను అనాధననీ , నన్ను తమ రాజ్యంలో ఉండటానికి అనుమతి ఇయ్యమని వేడుకుంది . దానికి శిఖర్ నిన్ను చూస్తూంటే భారీకాయంతో ఉన్నావు. నీవు మాంసాహారివైతే ఈ అడవి మొత్తం కొన్ని మాసాలలోనే మాయమైపోతుంది. కావున అడవిలో ఉండటానికి అనుమతి లేదంది. దానికి మహోదర, అయ్యోరాజా…ఎంతమాటంటివీ.? మీరు పొరబడినట్లున్నారు. నేను మాంసాహారిని కాను. స్వచ్ఛమైన శాఖాహారిని. నావల్ల మీ అధములకు ఎలాంటి ప్రమాదమూ ఎదురుకాదు.. ఎందుకంటే మాంసాహారులంతా మెరుపు వేగంతో కదలగలిగేవే… కానీ నేను అలా కదలలేను కదా. భారీకాయులంతా శాఖాహారులే అని చెప్పటానికి రుజువు మీ రాజ్యంలోనే ఉంది. కావాలంటే అవిగో మీ రాజ్య అధములలోని ఆ ఏనుగులను చూడండి. అవి ఏ మాంసాహారాన్ని ఆరగిస్తున్నాయి రాజా అని అడిగింది. మహోదర వాదనతో సంకటంలో పడిన రాజు, సరే. నా అధములకు నష్టమేమీలేకపోతే నీవు ఈ రాజ్యంలో ఉండుటకు ఎటువంటి అభ్యంతరమూలేదంది.. అధములు ఇంకేదో అనుమానం వ్యక్తం చేసేలోపే రాజు నిర్ణయాన్ని వ్యతిరేకించలేక విరమించుకున్నాయి..

మహోదర రాజ్యంలో చోటు లభించినందుకు ఆనందపడింది. దట్టమైన పొదలలో మహోదర దాక్కుని వచ్చిపోయే అధములందరినీ మింగేయడం మొదలెట్టింది. అధముల సంఖ్య తగ్గడం మొదలయ్యింది. అధముల అదృశ్యం వెనుక మర్మం అర్థంకాలేదు శిఖరాధములిరువురికీ.

ఇలా ఉండగా ఒకానొక రోజు ఎప్పటిలాగే మహోదర అటుగా పోతున్న అధమ జింక పిల్లను పట్టుకుని మింగుతుండటం అబల్ అనే ఎలుకపిల్ల చూసింది.ఇన్ని రోజులుగా ఈ రాజ్యంలో అదృశ్యమౌతున్న అధములకు కారణం నువ్వా. ఈ విషయం శిఖర్ కి చెబుతానుండు అంది అబల్.. దానికి మహోదర ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని మొదట బెదిరించింది..తర్వాత వేడుకుంది. అయినా అబల్ వినకుండా శిఖర్ వద్దకు బయలుదేరింది. అబల్ వేగాన్ని అందుకోలేక చేజిక్కించుకోలేకపోయింది మహోదర. ఈ విషయం శిఖరాధములిరువురికీ తెలిస్తే నా బతుకేంగానూ…నేను బతకాలంటే శిఖర్ దగ్గరకు చేరేలోపు అబల్ చావాలి…ఇదొక్కటే దారి అనుకుని సుఫారీ అనే నాగుపాముకు పురమాయించింది.. సుఫారీ ఈ పనిని వ్యసన్ , ఉద్రేక్ , బికార్ , పోకిర్ అనే నాలుగు తాచుపాములకు అప్పగించింది.

అబల్ శిఖర్ ని కలవడానికి వడివడిగా పోతుండగా వ్యసన్ , ఉద్రేక్ , బికార్ , పోకిర్ లు ఒకటి తర్వాత ఒకటి కాట్లేసాయి. విషప్రభావంతో అబల్ అక్కడికక్కడే తనువు చాలించింది.. ఆ తర్వాత సుఫారీ చెప్పిన అబల్ ఆనవాళ్లు లేకుండా మాయం చేయమనే మాటలు గుర్తొచ్చి పీక్కుని తినేసాయి. కానీ ఎముకలను మాత్రం వదిలేసాయి..

తెల్లారింది . అడవిలో అలజడి మొదలయ్యింది. అక్కడ పడి ఉన్న ఎముకల అవశేషాలు “అబల్” వేనని గుర్తించాయి అబల్ తాలూకు బంధువులు. ఇప్పటి వరకూ జరిగిన అధముల అదృశ్యానికి కారణమైనవారి పనే అయ్యుంటుందనీ. అధములంతా శిఖర్ పాలన బాగోలేదనీ , కొత్త రాజు అవసరమనీ నిరసించడం మొదలుపెట్టారు. శిఖర్ ఈ సంఘటనపై విచారణ జరపమని శోధక్ , పరిశోధక్ అనే గ్రద్ధలకు బాధ్యత అప్పగించింది. ఆ సంఘటనను చూసిన చంద్రుని వెన్నెలను అడిగారు శోధక్ , పరిశోధక్ లు… నేను వచ్చే సమయానికి వ్యసన్ , ఉద్రేక్ , బికార్ , పోకిర్ లనే నాలుగు తాచుపాములు కంగారుగా వెళ్ళడం చూసానంతే…అంతకుముందు ఏంజరిగిందో తెలియదంది వెన్నెల. ఈ సాక్ష్యం ఆధారంగా శోధక్ , పరిశోధక్ లు నాలుగు తాచుపాములనూ పట్టుకుని రాజు ముందు నిలబెట్టాయి. ఇప్పుడు ఈ నలుగురినీ శిక్షించడానికి సేకరించన సాక్ష్యాలు సరిపోతాయా అనడిగాడు శిఖర్… శోధక్ , పరిశోధక్ ల మౌనం ఆధారాలు సేకరించలేదని అర్థమయ్యింది శిఖర్ కి.. శిఖర్ కోపంతో మీరు ఏంచేస్తారో తెలియదు నా పదవి ఊడిపోయేలా ఉంది…ఈ అధముల ఆగ్రహాన్ని చల్లార్చేలా పని తొందరగా ముగించండని ఆదేశించాడు..

శోధక్ , పరిశోధక్ లు ఏంచేద్దాం అని ఆలోచిస్తూ ఒకటి ఈ సంఘటన వెనుక అసలు కారణాలను కనుక్కోవడం , రెండు ఈ నాలుగు పాములను చంపేయడం. దీనిలో మొదటిది చాలా ఎక్కువ సమయం పడుతుంది… ఈలోపు ఈ అధములంతా మనలను కూడా చంపేసేంత ఆగ్రహంలో ఉన్నారు… రెండవది చంపేయడం..దీనివల్ల అధములలో ఎగసిపడుతున్న ఆగ్రహావేశాలు చల్లబడతాయి. పైగా రాజు కూడా మెచ్చుకుంటాడు అని పొడిచి పొడిచి చంపేద్దామని నిర్ణయానికి వచ్చాయి.

వెన్నెల లేని సమయంలో శోధక్ , పరిశోధక్ అనే గ్రద్థలు వ్యసన్ , ఉద్రేక్ , బికార్ , పోకిర్ లను పొడిచిపొడిచి చంపేసాయి… ఈ తాచుపాములు గ్రద్థలైన మమ్మల్ని కూడా మింగడానికి ప్రయత్నించాయి. అందుకే ఆత్మరక్షణ కోసం చంపేసామని చెప్పాయి.

రాజ్యంలోని అధములంతా ఏదైతేనేమి రాజ్యానికి కంటకులైన నాలుగు తాచుపాములు చచ్చిపోయాయని ఆనందోసంబరాలు చేసుకున్నాయి. ఇన్ని రోజులుగా అడవిలో అదృశ్యమైపోతున్న అధములకు ఇదే సరైన నివాళి అంటూ కేరింతలు కొట్టాయి.

ఆవేశం చల్లారింది. మళ్ళీ మళ్ళీ ఈ రాజే రాజవ్వాలని ముక్తకంఠంతో స్తుతించారు అధములంతా. శిఖర్..శోధక్ , పరిశోధక్ లకు అభినందన సభ పెట్టి బహుమతులిచ్చాడు. తర్వాత ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు..

కొంతకాలం తన కార్యకలాపాలకు సెలవిచ్చి మరలా తన పనిని యథావిధిగా మొదలుపెట్టాడు మహోదర…

మళ్ళీ అడవిలో అలజడి మొదలయ్యింది .

Written By – Hema Srinivasa Rao