iDreamPost
android-app
ios-app

మహేష్ మెచ్చుకున్న క్యూట్ రీమేక్

  • Published Jul 19, 2020 | 9:44 AM Updated Updated Jul 19, 2020 | 9:44 AM
మహేష్ మెచ్చుకున్న క్యూట్ రీమేక్

ఈ మధ్య తమిళ మలయాళం సినిమాల మీద మనవాళ్ళు తెగ మనసు పారేసుకుంటున్నారు. నచ్చడం ఆలస్యం వెంటనే హక్కులు కొనేసుకుని క్యాస్టింగ్ వేటలో పడి స్క్రిప్ట్ లను లాక్ చేసుకునే పనిలో బిజీగా ఉంటున్నారు. లూసిఫర్, అయ్యప్పనుం కోశియుం, కప్పేల, జార్జ్ ఇలా ఒక్కొక్కటిగా లైన్ లో పడుతున్నాయి. తాజాగా తమిళ హిట్ మూవీ ఓ మై కడవులే కూడా తెలుగులో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై కోలీవుడ్ లో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు అశ్వత్ మారిముత్తు తీర్చిదిద్దిన వైనం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అశోక్ సెల్వన్, రితిక సింగ్, వాణి భోజన్ లీడ్ పెయిర్ గా నటించిన ఈ క్లీన్ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ మన ఆడియన్స్ టేస్ట్ కి సైతం బాగా కనెక్ట్ అవుతుందని గుర్తించి రైట్స్ తీసేసుకున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా దీన్ని మెచ్చేసుకున్నారు. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా యూనిట్ మీద ప్రశంసల జల్లులు కురిపిస్తూ సినిమాను బాగా ఎంజాయ్ చేసినట్టు పేర్కొన్నాడు. దీంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోయిన హీరో డైరెక్టర్ అందరూ తమ ఆనందాన్ని రీ ట్వీట్ చేసి పంచుకున్నారు. ఇది ఖచ్చితంగా దీని మీద ఆసక్తి రేపేదే. ఇప్పటికే ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ లో ఉన్న ఈ సినిమాను ప్రిన్స్ ఫ్యాన్స్ అప్పుడే ఓ లుక్ వేయడం మొదలుపెట్టారు. మరోవైపు సగటు ప్రేక్షకులు సైతం మహేష్ కే ఇంతగా నచ్చిందంటే గట్టి కంటెంటే ఉందనుకుంటారు .

ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ సేతుపతి చేసిన క్యామియో అక్కడ చాలా హెల్ప్ అయ్యింది. ఇక్కడ ఎవరితో చేయిస్తారో చూడాలి. ఓ మై కడవులే మనం కనివిని ఎరుగని కథ కాదు. కాకపోతే చక్కని కథాకథనాలతో చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది. ఎక్కడ విసుగు రాకుండా పూర్తిగా ఆస్వాదించేలా మెప్పిస్తుంది. విశ్వక్ సేన్ నిజంగా చేస్తే తనకు మంచి బ్రేక్ అయ్యే అవకాశం లేకపోలేదు. లాక్ డౌన్ పీరియడ్ తారలను ఇళ్ళలో ఖాళీగా ఉంచడమే కాదు ఇలా పరబాషా చిత్రాల మీద ఓ లుక్ వేసేలా చేయిస్తూ నచ్చితే కనక సోషల్ మీడియా ద్వారా ఫ్రీ ప్రమోషన్ కూడా అందుకుంటోంది. విశ్వక్ సేన్ ప్రస్తుతం పాగల్ తో పాటు హిట్ 2 మాత్రమే కమిటయ్యాడు. ఓ మై కడవులేకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది