iDreamPost
iDreamPost
ఇప్పుడంటే సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడిగా మహేష్ బాబుని ఓ రేంజ్ లో చూస్తున్నాం కానీ ముప్పై ఏళ్ళ క్రితమే తన అన్నయ్య రమేష్ బాబు కొన్ని కమర్షియల్ సినిమాలు చేసిన విషయం అప్పటి తరానికి బాగా గుర్తు. సామ్రాట్ అనే భారీ చిత్రంతో పద్మాలయ బ్యానర్ పై రమేష్ లాంచ్ అయినప్పుడు జరిగిన తంతు చిన్నది కాదు. చక్కని రూపంతో మంచి యాక్టింగ్ ఉన్న రమేష్ కొన్నేళ్లు కమర్షియల్ ఎంటర్ టైనర్స్ బాగానే చేశారు. అందులో భాగంగా వచ్చిందే ‘బ్లాక్ టైగర్’. సుప్రసిద్ధ దర్శకులు దాసరి నారాయణరావు గారి డైరెక్షన్ లో భానుప్రియా హీరోయిన్ గా రాజ్ కోటి సంగీత దర్సకత్వంలో భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందించారు.
అప్పటికి రమేష్ కి ఓ మోస్తరు మాస్ ఇమేజ్ ఉంది. ఇతన్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా నీడతో పరిచయం చేసిన దాసరితో రమేష్ బాబు సోలో హీరోగా చేసిన మూవీ ఇదే. ఓ స్టూడెంట్ సమాజంలో జరుగుతున్న అరాచకాలు భరించలేక బ్లాక్ టైగర్ గా మారిపోయి దుర్మారుల ఆగడాలు పట్టి వాళ్ళను నరకానికి పంపించే పాత్రలో రమేష్ బాబుకు మంచి పేరు వచ్చింది. అప్పటికే హీరోగా నా మొగుడు నాకే సొంతంతో హిట్టు కొట్టిన మోహన్ బాబు దాసరి గారి కోరిక మేరకు ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. చరణ్ రాజ్, శివకృష్ణ, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు, ప్రదీప్ శక్తి, త్యాగరాజు, గోకిన రామారావు తదితరులు మిగిలిన తారాగణం. భానుప్రియ రోల్ ని త్యాగపూరితంగా డిజైన్ చేయడం విశేషం.
ఈ సినిమాలో ‘ఒక జాబిలీ ఇది వేళని’ పాటను హైదరాబాద్ లోని 12 లొకేషన్లలో ఒకే రోజు షూట్ చేయడం అప్పట్లో పెద్ద రికార్డు. ఇరవై నాలుగు గంటల్లో అంత పెద్ద యూనిట్ ని వేసుకుని అటు ఇటు తిప్పుతూ ఇలా షూట్ చేయడం చూసి దటీజ్ దాసరి అని ప్రశంసించని వారు లేరు. ఇప్పుడు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇలా తీయడం దాదాపు అసాధ్యమే. కెఎస్ హరి ఛాయాగ్రహణం, విజయన్ ఫైట్స్ మాస్ కి బాగా కిక్ ఇచ్చాయి. బ్లాక్ టైగర్ కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. బయ్యర్లు కూడా లాభపడ్డారు. అయితే రమేష్ బాబు ఆ తర్వాత ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. ఈయన ఫామ్ లో ఉన్నప్పుడే మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇమేజ్ తెచ్చుకోవడం విశేషం. తర్వాత క్రమంలో సినిమాల నిర్మాణానికి, ఇతర వ్యాపార వ్యవహారాలకు పరిమితమైన రమేష్ బాబుని 90వ దశకంలో సినిమాలు చూసిన ప్రేక్షకులు మర్చిపోలేరు. అలా చేసిన వాటిలో ఈ బ్లాక్ టైగర్ ఓ చక్కని జ్ఞాపకం