దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ బుసలు కొడుతోంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. బాలీవుడ్లో ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్లు కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్లో కూడా నెమ్మదిగా కరోనా బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. గురువారం నాడు ఒక్కరోజే టాలీవుడ్లో ఇద్దరికి కరోనా సోకింది. ముందుగా మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి తనకు కరోనా సోకినట్టు ప్రకటించగా నిన్న రాత్రి పొద్దుపోయాక తనకు కరోనా సోకింది అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆయన వెల్లడించారు.
చివరిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది కానీ ఆర్.ఆర్.ఆర్ సినిమాని సంక్రాంతికి విడుదల చేసుకుంటాం మీ సినిమా వెనక్కి వాయిదా వేసుకోండి అని రాజమౌళి కోరడంతో మహేష్ బాబు అందుకు సమ్మతించి తన సినిమాని ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా ఇప్పుడు ఆగిపోయింది అనుకోండి అది వేరే విషయం.
సినిమా వాయిదా పడిన నేపథ్యంలో చాలా రోజుల నుంచి మహేష్ బాబు మోకాలి నొప్పితో బాధపడుతున్న కారణంగా స్పెయిన్ వెళ్లి దానికి సర్జరీ కూడా చేయించుకున్నారు. స్పెయిన్ నుంచి నేరుగా మహేష్ బాబు తన వదిన ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలని అనుకున్నారు. మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ దుబాయ్ లో నివాసం ఉంటున్న కారణంగా మహేష్ బాబు తన కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లారు. అక్కడే ఉండి క్రిస్మస్ సహా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న మహేష్ ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చారు.
సర్కారు వారి పాట ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలని భావిస్తున్న తరుణంలో షూటింగ్ కి వెళ్ళేముందు కరోనా పరీక్షలు చేయించడంతో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఒక సుదీర్ఘ నోట్ ను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా తనకు కరోనా సోకిందని, అందుకే గత కొద్ది రోజులుగా తనను నేరుగా కాంటాక్ట్ అయిన అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని మహేష్ బాబు కోరారు. అలాగే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా లక్షణాలు విషయంలో అయినా కాస్త ఉపశమనం లభిస్తుందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి తాను ఐసోలేషన్ లో ఉన్నానని డాక్టర్లు సూచించిన అన్ని సూచనలు పాటిస్తున్నా అని చెప్పుకొచ్చారు.