iDreamPost
android-app
ios-app

మహాసముద్రం సాహసం : పుష్పతో పోటీ

  • Published Jan 30, 2021 | 5:54 AM Updated Updated Jan 30, 2021 | 5:54 AM
మహాసముద్రం సాహసం : పుష్పతో పోటీ

ఆరెక్స్ 100 బ్లాక్ బస్టర్ తర్వాత ఏకంగా రెండేళ్ల గ్యాప్ తీసుకున్న దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న కొత్త సినిమా మహా సముద్రం. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీలో అదితి రావు హైదరి హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. ఇవాళ రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. ఆగస్ట్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు చెప్పేశారు. ఇంకా షూటింగ్ కొనసాగుతున్నప్పటికీ టాలీవుడ్ లో పోటీ పడి కర్చీఫ్ లు వేయడం మొదలయ్యింది కాబట్టి ఆ హడావిడిలోనే వీళ్ళు కూడా డేట్ ని లాక్ చేసుకున్నారు. ఏదైనా మార్పు ఉంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం కానీ ప్రస్తుతానికి ఫిక్స్ అయ్యింది.

ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. సరిగ్గా ఆరు రోజుల ముందు ఆగస్ట్ 13న అల్లు అర్జున్ పుష్పని ఇంతకు ముందే లాక్ చేశారు. ఇదీ నిర్మాణంలోనే ఉంది. ఇండిపెండెన్స్ డే సెలవుని దృష్టిలో ఉంచుకుని అలా ప్లాన్ చేశారు. ఇంత తక్కువ గ్యాప్ లో మహాసముద్రంని తీసుకురావడం ఒకరకంగా సాహసమే. ఎందుకంటే ఇందులో ఉన్న శర్వానంద్ వరస డిజాస్టర్లలో ఉన్నాడు. శ్రీకారం హిట్ అయితే మళ్ళీ ఫామ్ వస్తుంది. ఏ చిన్న తేడా వచ్చినా కథ మళ్ళీ మొదటికే. ఇక సిద్దార్థ్ తెలుగు నుంచి మాయమై చాలా కాలమయ్యింది. గృహం బాగానే ఆడింది కానీ మరీ మన నిర్మాతలు వెంటపడేంత అయితే కాదు.

సో భారమంతా దర్శకుడు అజయ్ భూపతి దీన్ని ఎలా తెరకెక్కించాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. టైటిల్ సౌండ్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. అందులోనూ సముద్రం బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ లవ్ స్టోరీగా దీని గురించి టాక్ ఉంది. నిజంగా ఆ రేంజ్ లో ఉంటే పుష్ప పోటీని తట్టుకోవచ్చు. లేదా ఒకవేళ పుష్ప కనక సుకుమార్ తీసిన రంగస్థలం రేంజ్ లోనో అల వైకుంఠపురముంలో స్థాయిలోనో రెస్పాన్స్ తెచ్చుకుంటే అప్పుడు కొంచెం ఇబ్బంది తప్పదు. ఏమైనా పుష్పకు స్టార్ ఇమేజ్ అండగా ఉండగా మహా సముద్రం భారం మొత్తం కంటెంట్ మీద ఉంది. చూడాలి ఈ పోటీ ఎలా ఉండబోతోందో.