iDreamPost
iDreamPost
మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవహారానికి బీజేపీ స్మాష్ షాట్ తో ముగింపు పలికింది. బీజేపీ-శివ సేన కూటమి మెజారిటీ సీట్లు సాధించినా, ముఖ్యమంత్రి పీఠం మీద శివసేన పట్టుబట్టడంతో నెలరోజులు సాగిన మహారాష్ట్ర రాజకీయం ట్విస్టుల మీద ట్విస్టులు తిరిగి బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. NCP నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇంకా ప్రజలు నిద్రలేవక ముందే రాష్ట్రపతి పాలన ఎత్తివేయటం ,దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం ఎవరు ఊహించనంత వేగంగా జరిగింది. అయితే ఈ ప్రభుత్వానికి NCP నేత శరద్ పవార్ మద్దతు ఇచ్చాడా? లేదా? అన్నది స్పష్టం కాలేదు. శరద్ పవార్ నుంచి ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. అజిత్ పవార్ 23 మంది NCP ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ తో చేతులు కలిపాడు. శివసేనలో కూడా చీలిక వొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవుతాడని నిన్న రాత్రి వార్తలు రావటంతో అమిత్ షా రాత్రికి రాత్రి రచించిన ప్రణాళికను కొన్ని గంటలలోనే అమలుపరిచారు.
రెండు రోజుల కిందట శరద్ పవార్ మోడీ తో భేటి అయినప్పటునుంచి రాజకీయవర్గాలలో అనుమానం నెలకొని ఉన్నా, దేశంలోనే సీనియర్ నాయకుడైనా శరద్ పవార్ తన విశ్వసనీయతను దెబ్బతీసుకునేలా వ్యవహరిస్తారా? అన్న మీమాంశ నెలకొంది. ఈ రోజు జరిగిన పరిణామాలకు శరద్ పవార్ మద్దతు ఉన్నా లేకున్నా, శరద్ పవార్ మోసం చేశాడన్నా ఆరోపణలు ఎదుర్కోక తప్పదు.
2014 లో శివసేన మద్దతు ఇవ్వకపోవటంతో మూజువాణి ఓటుతో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం విశ్వాసపరీక్షలో గెలిచింది. అప్పుడు కూడా NCP బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు … ఎవరు మద్దతు ఇచ్చారో తెలియకుండానే దేవేంద్ర ఫడ్నవీస్ మైనారిటీ ప్రభుత్వం విశ్వాస పరీక్ష గెలవటం బీజేపీ మార్క్ రాజకీయానికి ఒక మచ్చుతునక.
అజిత్ పవార్ మీద సుమారు పది వేల కోట్ల కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. 2014 మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ అవినీతి కేంద్రంగానే ప్రచారం చేసింది.