iDreamPost
iDreamPost
తెలుగు సినిమాల్లో యముడి సబ్జెక్టుది ప్రత్యేక స్థానం. దేవాంతకుడు, యమగోల, యముడికి మొగుడు, యమలీల లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఫాంటసీ బ్యానర్ లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నాయి. అయితే వీటన్నింటిలో హీరోలే టైటిల్ పాత్రలు పోషించారు కానీ ఫిమేల్ ఓరియెంటెడ్ రాలేదు. ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ 1994లో వచ్చిన సినిమా మగరాయుడు. లేడీ అమితాబ్ గా కర్తవ్యం, పోలీస్ లాకప్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో హీరోలతో సమానంగా మార్కెట్ ని సంపాదించుకున్న విజయశాంతి టైటిల్ రోల్ లో ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో అన్బు లక్ష్మి ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు.
విలన్లు పన్నిన కుట్రలో హీరో చనిపోతే యముడి ఆదేశంతో అతని ఆత్మ హీరోయినైన లేడీ డాక్టర్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి తాను ఆడది అనే సంగతి మర్చిపోయి అచ్చం మగరాయుడిలా తిరగడం మొదలు పెడుతుంది. దీంతో ఆమె వింత ప్రవర్తన అర్థం కాక అందరూ అయోమయం చెందుతారు. ఈలోగా తన చావుకు కారణమైన వాళ్ళను పట్టుకునే ప్లాన్ వేసుకుంటాడు హీరో. మరి విలన్ల ఆట కట్టించాక మగరాయుడు ఏమయ్యాడు, కథ ఎలా కంచికి చేరుకుందనేదే ఇందులో అసలు పాయింట్. ఆద్యంతం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ తో రూపొందిన మగరాయుడు ఆశించిన అంచనాలు అందుకోలేకపోయింది.
కామెడీ పుష్కలంగా ఉన్నప్పటికీ విజయశాంతి ఇమేజ్ దీనికి ప్రతిబంధకంగా మారింది. గౌరవప్రదమైన పవర్ ఫుల్ పాత్రల్లో అప్పటిదాకా చూసిన ఆవిడను ఇలాంటి ఊర మాస్ హాస్య పాత్రలో జనం రిసీవ్ చేసుకోలేకపోయారు. హీరోగా చేసిన కార్తిక్ కు ఇక్కడ పెద్దగా గుర్తింపు లేకపోవడం కూడా మైనస్ అయ్యింది. రాజ్ కోటి పాటలు, మారుత భరణి సంభాషణలు, చోటా కె నాయుడు ఛాయాగ్రహణం సమకూర్చారు. అప్పటిదాకా టాలీవుడ్ యముడంటే సత్యనారాయణే. మార్పు కోసం కోట శ్రీనివాసరావును తీసుకున్నారు. ఆయన అద్భుతంగా చేసినా కూడా ఎందుకో జనానికి నచ్చలేదు. దేవుళ్ళ మధ్య కామెడీ కూడా కొంత ఓవర్ డోస్ అయ్యింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ ఫలితం దక్కింది కానీ ఇప్పుడు చూస్తే మగరాయుడు నవ్వుకునే వినోదాన్ని ఖచ్చితంగా ఇస్తుంది