iDreamPost
iDreamPost
పాతిక సంవత్సరాల క్రితం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన భారతీయుడు సీక్వెల్ గా దర్శకుడు శంకర్ ఇండియా 2ని రెండేళ్ల క్రితమే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందు అగ్ని ప్రమాదం జరగడం, అందులో కొందరు ప్రాణాలు కోల్పోవడం, వ్యవహారం కోర్టు దాకా వెళ్లి నష్టపరిహారాలు కట్టుకోవడం ఇదంతా ఓ నాలుగైదు నెలలు సాగింది. దెబ్బకు మళ్ళీ షూటింగ్ రీ స్టార్ట్ కానేలేదు. అదుగో ఇదుగో ఆంటూనే కాలం గడిచిపోయింది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ సైతం ఓ ఇంటర్వ్యూలో ఇండియన్ 2కి సంబంధించి తనకెలాంటి అప్ డేట్ లేదని, కొనసాగుతుందో లేదో చెప్పలేనని పేర్కొనడం అనుమానాలు మరింత పెంచింది.
ఇది ఎలాగూ మొదలయ్యేలాగా లేదని శంకర్ ఆ మధ్య దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అధికారిక ప్రకటన ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. రాబోయే వేసవిలో షూట్ కి వెళ్లేలాగా ప్లానింగ్ కూడా జరిగిపోయింది. తాజాగా లైకా సంస్థ ఈ పరిణామం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లినట్టు చెన్నై న్యూస్. తాము కేటాయించిన 230 కోట్ల బడ్జెట్ లో ఇప్పటికే 180 కోట్లు ఖర్చు పెట్టించిన శంకర్ దాన్ని పూర్తి చేయకుండా వేరే కొత్త ప్రాజెక్ట్ కు వెళ్లిపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. మిగిలిన పారితోషికాలు మరియు మొత్తాన్ని కోర్టులో జమ చేసేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఇది శంకర్ ను ఇరకాటంలో పెట్టే వ్యవహారమే. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత శంకర్ ఇండియన్ 2 ఎందుకు కంటిన్యూ చేయలేదనే దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. హీరో కమల్ హాసన్ కూడా తన విక్రమ్ సినిమాతో పాటు రాజకీయ ప్రచారంలో బిజీ అయిపోయారు. మరి ఇన్నేసి కోట్లు ఖర్చు పెట్టాక ఎందుకు ఆపేశారనేది దర్శక నిర్మాతలకు తప్ప ఎవరికీ తెలియకుండా పోయింది. ఇప్పుడేమో ఇష్యూ కోర్టు దాకా వెళ్ళింది. ఒకవేళ లైకాకు అనుకూలంగా తీర్పు లేదా స్టే ఆర్డర్ వస్తే మాత్రం చరణ్-శంకర్ ల కాంబో చాలా ఆలస్యమవుతుంది. మరి న్యాయస్థానం ఎలా స్పందించబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.