iDreamPost
android-app
ios-app

టక్ జగదీశ్ VS లవ్ స్టోరీ : కొత్త ట్విస్ట్

  • Published Jan 26, 2021 | 5:10 AM Updated Updated Jan 26, 2021 | 5:10 AM
టక్ జగదీశ్ VS లవ్ స్టోరీ :  కొత్త ట్విస్ట్

నిన్న సాయంత్రం ఊహించని విధంగా లవ్ స్టోరీ సినిమా యూనిట్ విడుదల తేదిని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు పోస్టర్ ని వదలడంతో అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు కానీ అదే సమయంలో న్యాచురల్ స్టార్ నాని అభిమానులు మాత్రం గుర్రుమన్నారు. కారణం అదే డేట్ ని గతంలోనే టక్ జగదీశ్ కు కేటాయించారు కాబట్టి. పండగ టైంలోనే దీని తాలుకు పబ్లిసిటీని మొదలుపెట్టారు కూడా. మరి ఇప్పుడు ఉన్నట్టుండి లవ్ స్టొరీ సీన్లోకి రావడం ఏమిటనేది వాళ్ళ ప్రశ్న. అది కూడా చడీ చప్పుడు లేకుండా సైలెంట్ గా ప్రకటన ఇవ్వడం కూడా ఆశ్చర్యం కలిగించేదే.

ధియేటర్లు తెరుచుకున్నాక సంక్రాంతి సినిమాలకు వచ్చిన వసూళ్లు చూసి నిర్మాతలు ధైర్యంగా తమ రిలీజ్ డేట్లను పోటీ పడి మరీ ప్రకటించేస్తున్నారు. క్లాష్ అయినా పర్వాలేదు వాళ్లు అనుకుంటున్న టైంకే గట్టిగా ఫిక్స్ అవుతున్నారు. అయితే లవ్ స్టొరీ టక్ జగదీశ్ ముఖాముఖీ పోటీ పడటం అంత మంచిది కాదనే సంకేతాలు ట్రేడ్ నుంచి వస్తున్నాయి. అందుకే టక్ జగదీశ్ నే ఒక వారం ఆలస్యంగా వచ్చేలా ఇప్పటికే అంతర్గతంగా ఒప్పందం జరిగిందని మరో వార్త ఉంది కాని అధికారికంగా తెలియాల్సి ఉంది. ఒకవేళ లేదూ పోటీకి సై అంటే మాత్రం మూవీ లవర్స్ కి ఒకే రోజు రెండు ట్రీట్లు దక్కుతాయి.

ఫిదా తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన సినిమా కావడతో లవ్ స్టొరీ మీద ఫ్యామిలీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నాగ చైతన్య సాయి పల్లవి ఫస్ట్ టైం కాంబినేషన్ వాటిని రెట్టింపు చేస్తోంది. టీజర్ కు వచ్చిన స్పందన కూడా బాగానే ఉంది. ఇప్పటికే రెండు లిరికల్ వీడియోలు బాగా పేరు తెచ్చుకున్నాయి. ఈ కోణంలో చూసుకుంటే టక్ జగదీశ్ పోస్టర్లు వదలడం తప్ప ఇంకా వీడియో మెటీరియల్ ఏదీ రిలీజ్ చేయలేదు. కాబట్టి పరస్పర ఒప్పందం కింద ఏదైనా మార్పు ఉండే అవకాశం లేకపోలేదు. మొత్తానికి లవ్ స్టొరీ ఇచ్చిన ట్విస్ట్ తో టక్ జగదీశ్ ఆలోచనలో పడ్డ మాట వాస్తవం.