iDreamPost
android-app
ios-app

హుజూరాబాద్ లో అంతకుమించి..!

  • Published Aug 01, 2021 | 11:18 AM Updated Updated Aug 01, 2021 | 11:18 AM
హుజూరాబాద్ లో అంతకుమించి..!

కొన్ని నెలలుగా తెలంగాణ రాజకీయాలు హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. బీజేపీ తరఫున ఈటల బరిలో ఉండగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఓ వైపు అభ్యర్థి గురించిన అన్వేషణ కొనసాగిస్తూనే.. ఓటు బ్యాంకు రాజకీయాలను జోరుగా చేస్తున్నారు. కానీ కేసీఆర్ కు పంటి కింద రాయిలా కొందరు మారారు. టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా వందలాది మంది హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే.. ఉప ఎన్నిక బరిలో ఉంటామని హెచ్చరిస్తున్నారు.

నామినేషన్లు వేస్తామంటున్న 1,200 మంది..

ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత… తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ఓ కొత్త నినాదం వినిపించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్ లో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతుండటంతో… ‘‘ఎమ్మెల్యే సారూ.. మీరు రాజీనామా చేయండి.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. కావాలంటే మిమ్మల్ని ఉప ఎన్నికల్లో మేం గెలిపించుకుంటాం’’ అంటూ వాట్సాప్ లలో, ఫేస్ బుక్ లో మెసేజ్ లు హల్ చల్ చేశాయి.

ఇదిలా ఉండగానే.. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించడం లేదని భావిస్తున్న వాళ్లంతా హుజూరాబాద్ లో పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు. ఏడాది కిందట సమ్మె చేశారని 7,500 మందికిపైగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తెలంగాణ సర్కారు ఉద్యోగాల్లోంచి తీసేసింది. తమను తిరిగి చేర్చుకోవాలని ఎంతమందిని అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే.. హుజూరాబాద్ లో నామినేషన్లు వేస్తామని స్పష్టం చేశారు.

Also Read : కేసీఆర్‌ మాట అన్నారంటే వెనక్కి తగ్గరు.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రశంసల వర్షం

ఫీల్డ్ అసిస్టెంట్ల బాటలో లెక్చరర్స్ ఫోరం నేతలు నడుస్తున్నారు. ప్రైవేటు టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భృతి ఇచ్చింది. లెక్చరర్లను పట్టించుకోలేదు. రెండేళ్లుగా జీతాలు సరిగ్గా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం తమ విషయంలో చొరవ చూపడం లేదని వాళ్లు వాపోతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు. తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 మంది బరిలో ఉంటామని చెబుతున్నారు.

ఎంపీటీసీల ఫోరం నాయకులు కూడా హుజూరాబాద్ లో నామినేషన్ వేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వం తమకు నిధులు ఇవ్వడం లేదని మండిపడుతున్న ఎంపీటీసీలు.. తమ సమస్యలు పరిష్కరించకపోతే హుజూరాబాద్ ఎన్నికలో పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తామని చెబుతున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఇంటింటి ప్రచారం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

మిడ్ మానేరు ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన ముంపు గ్రామాల ప్రజలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని మిడ్ మానేరు నిర్వాసితులు చెబుతున్నారు. అందుకే గ్రామానికి 10 మంది చొప్పున హుజూరాబాద్ లో నామినేషన్ వేస్తామని అంటున్నారు. మిడ్ మానేరు బాధితుల సంఘం తరఫున 120 మంది దాకా పోటీలో ఉంటామని హెచ్చరిస్తున్నారు.

భయపెడుతున్న నిజామాబాద్ రిజల్ట్

2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కూతురు, సిట్టింగ్ ఎంపీ కవిత పోటీలో నిలవగా.. బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ బరిలో నిలబడ్డారు. కానీ పసుపు రైతులు కూడా భారీగా నామినేషన్లు వేశారు. ఏకంగా 179 మంది పసుపు రైతులు పోటీ చేశారు. ఈ ఎన్నికలో అర్వింద్ 80 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన రైతులు.. భారీగా ఓట్లను చీల్చారు. కవిత ఓటమికి కారణమయ్యారు. ఇప్పుడు ఇదే టీఆర్ఎస్ ను భయపెడుతోంది. అప్పటి ఎన్నికలో సీఎం కూతురే ఓడిపోయినప్పుడు.. ఇప్పుడు ఓ లెక్కనా అనే భావన గులాబీ నేతల్లోనే కనిపిస్తోంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సరికి వీళ్లలో ఎంత మంది పోటీలో ఉంటారనేదే కీలకం. ఆలోపు కేసీఆర్ కమాల్ చేస్తే.. అంతా గప్ చుప్ అయిపోతారు.

Also Read : ఈటల పాదయాత్రకు బ్రేక్.. వాట్ నెక్స్ట్?