iDreamPost
android-app
ios-app

బీహార్‌ ఎన్నికలలో ఎల్జేపీ రివర్స్ రాజకీయం ఆర్జేడీకి లభించేనా..?

బీహార్‌ ఎన్నికలలో ఎల్జేపీ రివర్స్ రాజకీయం ఆర్జేడీకి లభించేనా..?

కాలచక్రం గిర్రున తిరిగింది.15 ఏళ్ల కిందట బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన లోక్ జనశక్తి పార్టీ పాత కథను పునరావృతం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నాడు తండ్రి ఆర్జేడీ అధినేత లాలూ పాలిట విలన్‌గా మారితే నేడు కొడుకు నితీశ్‌ కుమార్‌ని రాజకీయంగా చావుదెబ్బ కొట్టినట్లే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.

అప్పటికి యుపిఎ-I ప్రభుత్వంలో ఆర్జేడీ,ఎల్‌జెపి రెండు భాగస్వామ్యంగా ఉన్నాయి. పైగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రామ్ విలాస్ పాశ్వాన్ మంత్రిగా కూడా ఉన్నారు. కానీ 2005 ఫిబ్రవరిలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో సీనియర్ పాశ్వాన్ ఆర్జేడీతో విభేదాలను సాకుగా చూపుతూ ఒంటరిగా పోరు సలిపారు. ఆనాటి ఎన్నికలలో ఆర్జేడీకి వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలోకి దింపిన ఎల్‌జెపి కాంగ్రెస్ అభ్యర్థులపై పోటీ చేయలేదు.

2005 అసెంబ్లీ ఎన్నికలలో లోక్ జనశక్తి మొత్తం 243 నియోజకవర్గాలకు గాను 203 స్థానాలలో తమ అభ్యర్థులను పోటీకి నిలిపింది. ఆ ఎన్నికలలో కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకున్న ఎల్‌జెపి 12 సీట్లలో రెండో స్థానం,84 చోట్ల మూడో స్థానం దక్కించుకుంది. ఇక ఎల్జేపీ ఓడిపోయిన స్థానాలలో ఓట్ల శాతం పరిశీలిస్తే 85 స్థానాలలో 10 శాతం కంటే ఎక్కువ,33 సీట్లలో 20 శాతానికి పైగా ఓట్లు ఎల్జేపీకి పోలయ్యాయి. వీటిలో సుమారు 20 నియోజకవర్గాలలో ఎల్జేపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. కాగా ఎల్జేపీకి 10 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాలలో కూడా ఎన్డీయే అభ్యర్థులు కేవలం 1000-2000 ఓట్ల తేడాతో గెలిచిన సీట్లు ఉన్నాయి. దీంతో యూపీఏ సిట్టింగ్ స్థానాలలో ఆర్జేడీ 21 సీట్లను కోల్పోగా కాంగ్రెస్ 1 సీటు,ఎన్సీపీ 2 సీట్లు కోల్పోయి ముఖ్యమంత్రి పీఠానికి దూరమైంది.

సీన్ కట్ చేస్తే 2015 ఎన్నికలలో నితీశ్‌ కుమార్‌ని ముఖ్యమంత్రి గద్దె దించడమే తమ లక్ష్యమని చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. పోలింగ్ ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయినప్పటికీ జేడీయూతో విభేదించి ఎల్‌జెపి సొంతంగా 137 స్థానాలలో పోటీ చేసింది.సేమ్ టు సేమ్ 2005 లాగానే జేడీయూ పోటీ చేసిన స్థానాలలో అభ్యర్థులను నిలిపిన ఎల్‌జెపి బీజేపీపై మాత్రం పోటీకి దిగలేదు. ఆ పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులలో మెజార్టీ భాగం బీజేపీ,జేడీయూ అసమ్మతి నేతలు కావడం గమనార్హం.ఆయా పార్టీ టికెట్లు దొరకని నేతలు ఎన్నికల వేళ ఎల్జేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీకి దిగారు.

అప్పట్లో ఆర్జేడీ ప్రభుత్వాన్ని కూలదోసి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడడంలో ఎల్‌జెపి క్రియాశీలక పాత్ర పోషించింది. తాజా అసెంబ్లీ ఎన్నికలలో కూడా జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఓట్లకు భారీగా చిల్లు పెట్టిందని అంచనాలు ఉన్నాయి. ఇది వాస్తవ రూపం దాలిస్తే తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవడంలో చిరాగ్ పాశ్వాన్ తన వంతు పాత్ర వహించినట్లే.

మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఎల్‌జెపి 3-5 శాతం ఓట్లు సాధించి అధికార మార్పిడిలో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2005 ఎన్నికలలో తాము ఓడినప్పటికీ ఆనాటి సీఎం లాలూప్రసాద్ ఆధ్వర్యంలోని ఆర్జేడీ ప్రభుత్వాన్ని దింపడంలో ఎల్‌జెపి కీలక పాత్ర వహించింది. ఇప్పుడు అందుకు రివర్స్ గా పదిహేనేళ్ల తర్వాత ఆర్జేడీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడంలో ఎల్‌జెపి తన వంతు పాత్రని పోషించినట్లు కనిపిస్తోంది.