iDreamPost
iDreamPost
ప్రతిష్టాత్మకంగా సాగిన పంచాయితీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అనుచరులు ప్రభంజనం సృష్టించారు. పంచాయితీ పోరు వద్దు మొర్రో అంటున్నా పట్టుదలకు పోయిన టీడీపీకి చెంపపెట్టుగా ఫలితాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ అభిమానులే ఆధిక్యం సాధించారు. 175 నియోజకవర్గాల్లోనూ మెజార్టీ పంచాయితీలు అధికార పార్టీకే దక్కడం విశేషం.
కొన్ని నియోజకవర్గాల్లో పోటీ ఇవ్వగలిగినప్పటికీ టీడీపీ కి పూర్తిగా ఆశాభంగం అయ్యింది. జనసేన- బీజేపీ కూటమి ప్రభావం అంతంతమాత్రంగా కనిపించింది. కుప్పం నుంచి పులివెందుల వరకూ హిందూపురం మీదుగా ఫ్యాన్ గాలి జోరు పెరిగింది. అన్నింటికీ మించి అమరావతి ప్రాంతంలో కూడా జగన్ ఎజెండాకు జనం పట్టం కట్టడం ఆసక్తికరంగా మారుతోంది. రాజధాని వికేంద్రీకరణ తర్వాత మారిన పరిణామాలతో వైఎస్సార్సీపీకి ఎదురుగాలి తప్పదని ఆశించిన ప్రతిపక్షాలకు భంగపాటు తప్పలేదు.
గుంటూరు జిల్లా పరిధిలోని మండల కేంద్ర పంచాయితీల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. ఇక సీఆర్డీయే పరిధిలో ఉన్న తాడికొండలో 532 ఓట్లు, ఫిరంగిపురంలో ఏకంగా 4348 ఓట్లు, అమరావతిలో 108, అచ్చంపేటలో 3200 ఓట్లు, క్రోసూరులో 1776 ఓట్లు, ప్రత్తిపాడు లో 2283 ఓట్లు తేడాతో వైఎస్సార్సీపీ అభిమానులు గెలిచారు. మంగళగిరి నియోజకవర్గంలో కూడా మెజార్టీ పంచాయితీలు అధికార పార్టీ కి దక్కాయి. దాంతో గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ రెబల్స్ తో కలిపి నాలుగో విడత ఎన్నికల్లో 160 సీట్లు పాలకపక్షం ఖాతాలో చేరాయి. టీడీపీ 45, జనసేన 3, ఇతరులు మరో 6 చోట్ల విజయం సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి 75 శాతం సీట్లు వైఎస్సార్సీపీ విజయపరంపరలో చేరాయి.
అమరావతి కోసమంటూ చంద్రబాబు సారధ్యంలో సాగుతున్న ఉద్యమ ప్రభావం ఆ కొద్ది గ్రామాల బయట కనిపించడం లేదని తాజా ఫలితాలు చాటుతున్నాయి. ఉద్యమం పేరుతో చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదని స్పష్టం చేస్తున్నాయి. జగన్ కి జనాదరణ మరింత పెరిగిందని చాటుతున్నాయి. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్సార్సీపీ బలోపేతం అవుతున్నట్టు కనిపిస్తోంది.
చంద్రబాబు ఎత్తులు చివరకు స్వగ్రామం నారావారి పల్లె మినహా అమరావతిలో కూడా లేదని అర్థమవుతోంది. దాంతో అమరావతి పరిధిలోని పంచాయితీ ఎన్నికల ఫలితాలతో టీడీపీ పూర్తిగా ఢీలా పడడం ఖాయంగా ఉంది. ఆశించిన చోట కూడా భంగపాటుకి గురికావడంతో సైకిల్ శ్రేణులు చతికిలపడుతున్నట్టు చెబుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో అమరావతి ఉద్యమం పేరుతో సాగుతున్న వారికి కూడా గుణపాఠం కావాలనే అభిప్రాయం వినిపిస్తోంది.