iDreamPost
android-app
ios-app

Liquor, petrol – మద్యం, పెట్రోలు… రెండూ ఒకటేనా సోము…?

  • Published Nov 09, 2021 | 12:34 PM Updated Updated Mar 11, 2022 | 10:35 PM
Liquor, petrol – మద్యం, పెట్రోలు… రెండూ ఒకటేనా సోము…?

‘మద్యం.. పెట్రోలు’.. రెండూ ఒకటేనా సోము? ఇది సామాన్యులలో కూడా మెదులుతున్న ప్రశ్న. కేంద్రం పెట్రోల్‌.. డీజిల్‌ ధరలు తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్‌ ధరలు తగ్గించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. పనిలో పనిగా రాష్ట్రంలో మద్యం ధరల పెంపు వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, వాటి ధరలు కూడా తగ్గించాలని విజయవాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అయితే సోము పెట్రోలు.. మద్యాన్ని ఒకే గాటిన కట్టడం విమర్శలకు దారితీస్తోంది.

పెట్రోల్‌, డీజిల్‌ ప్రజలకు నిత్యావసర వస్తువుల్లో ఒకటిగా మారాయి. ఇవి ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. వీటి ధరల పెంపు కొంతమందిపై ప్రతక్ష్యంగాను, మరికొందరిపై పరోక్షంగాను భారం పడుతుంది. ప్రయాణీకులకు భారమవుతుంది. వస్తు రవాణా చార్జీలు పెరిగి పరోక్షంగా ఆ భారం ప్రజల అందరి మీద పడుతోంది. ఇటీవల నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి డీజిల్‌ ధర పెంపు ప్రధాన కారణమైంది. పలు ప్రభుత్వ రంగ సంస్థల మీద కూడా ఈ భారం పడుతుంది. మద్యం అనేది నిత్యావసర వస్తువు కాదు. కొంతమందికి అదొక వ్యసనం. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికి పోవడానికి ఇదొక కారణం.

సామాన్యులను ఈ అలవాటుకు దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. వీటి ధరలు పెంచడం ద్వారా ప్రజలపై పరోక్షంగా భారంపడే అవకాశం లేదు. మద్యం ధరలు పెంచడం వల్ల వినియోగం చాలా వరకు తగ్గిందని గణంకాలు చెబుతున్నాయి. అటువంటి ఈ రెండు ఒకటే అన్నట్టుగా సోము మాట్లాడడం విడ్డూరంగా ఉందని ప్రజలు చెప్పుకుంటున్నారు. ధరలు తగ్గించమని డిమాండ్‌ చేయడంతోపాటు మద్యం ధరలు పెరగడం వల్ల రోజుకు రూ.225 చొప్పున సామాన్యుల నుంచి ఏడాదికి రూ.1.50 లక్షల వరకు దోచేస్తోందని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం పథకాల ద్వారా ఇస్తున్న సొమ్ములన్నీ మద్యం రూపంలో దోచేస్తోందని చిత్రమైన ఆరోపణ చేశారు. చమురు ధరల తగ్గింపు ప్రజల్లో సానుకూలత రాకపోవడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలల్లో ఉన్న ప్రభుత్వాలే కారణమని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. దీనితో రెండు రాష్ట్రాల బీజేపీ నాయకులు అధికారపార్టీ మీద ఇలా ఎదురుదాడి చేయడానికి చమురు ధరల తగ్గింపు విషయంలో కేంద్రం డొల్లతనాన్ని బయటపెట్టడమే కారణమంటున్నారు.

గడిచిన నాలుగైదేళ్లలో పెట్రోల్‌.. డీజిల్‌ ధరలు పెంచుతూ సామాన్యులపై కొండంత భారాన్ని మోపిన కేంద్ర ప్రభుత్వం… ఇటీవల లీటరుకు రూ.ఐదు చొప్పున తగ్గించి గోరంత ఉపశమనం కలిగించింది. అయితే ఇది కంటితుడుపు చర్యగానే సామాన్యులు భావిస్తున్నారు తప్ప… తమకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా వారు పరిగణించడం లేదు. పైగా ఇటీవల దేశ వ్యాప్తంగా జరిగిన ఉప పోరులో చేదుఫలితాలు చవిచూసిన కేంద్రం చమురు ధరలు తగ్గించడం ద్వారా ప్రజాగ్రహాన్ని కొంత వరకు తగ్గించుకునే ప్రయత్నమేననే విమర్శలున్నాయి.

చమురు ధరల తగ్గింపు విషయంలో ప్రజల నుంచి సానుకూలత లేకపోవడంతో బీజేపీ నాయకులు కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట చమురుపై వ్యాట్‌ను తగ్గించాలని, ప్రజల మీద భారం పడకుండా చూడాలని ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు తగ్గిస్తున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారు. బీజేపీ సాగిస్తున్న ప్రచారంలో నిజం లేదని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. తాము గతం నుంచి ఒకే వ్యాట్‌ విధిస్తున్నామని, కొత్తగా పెంచింది ఏమీ లేదని తేల్చి చెబుతున్నాయి. ఏపీలో వ్యాట్‌కు అదనంగా గత చంద్రబాబు ప్రభుత్వం విధించిన ఒకరూపాయి సెస్‌ మినహా తాము వ్యాట్‌ పెంచడం కాని, అదనపు పన్నులు వేయడం కాని చేయలేదని జగన్‌ ప్రభుత్వం ప్రజలకు అర్థం అయేలా వివరించింది. దీనితో చమురు ధరల తగ్గింపు వ్యవహారంలో తమ ప్రయోజనాలు నెరవేరకపోవడంతో బీజేపీ నేతలు ఇలా ఎదురుదాడికి దిగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read : Demonetisation- పెద్ద నోట్ల రద్దుకు అయిదేళ్లు