Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు, ఇంగ్లీష్ గోల నడుస్తుంటే, పార్లమెంట్‌లో ఒకాయన సంస్కృతాన్ని నెత్తికెత్తుకున్నాడు. సంస్కృతం మాట్లాడితే సుగర్ రాదు, కొలెస్ర్టాల్ కంట్రోల్‌లో ఉంటుందని తేల్చేశాడు. పైగా దీని మీద పరిశోధనలు కూడా జరిగాయంటున్నాడు.
షుగర్ వ్యాధి వస్తే అసలు సమస్య ఏమంటే, ప్రతి అడ్డమైన వాడు సలహాలు చెబుతాడు. ఒకడు వేపాకు తినమంటాడు, ఇంకొకడు కాకర కాయ రసం తాగమంటాడు. పరగడుపున నీళ్లు తాగితే సుగర్ తగ్గుతుందని ఒకాయన, కూరగాయలు మాత్రమే తినమని ఇంకొకరు ఇలా చెబుతుంటారు.
షుగర్ పేషంట్స్ ఎవరి మాటలు వినాలో తెలియక తికమక పడుతుంటారు. ఇప్పుడు ఈయన సంస్కృతం మాట్లాడమంటున్నాడు. సంస్కృతం అనే పదానికి పల్లెల్లో వేరే అర్థం ఉంది.
తెలుగు మాట్లాడ్డమే సరిగా రాని జనరేషన్ నడుస్తోంది. ఇక సంస్కృతం అంటే అంతే సంగతులు.
మధ్యప్రదేశ్‌లోని సాత్నా నుంచి గణేష్‌సింగ్ బీజేపీ ఎంపీగా నాలుగుసార్లు ఎన్నికయ్యాడు. ఇలా ఏదో ఒకటి మాట్లాడి న్యూస్‌లో ఉండడం ఆయన ప్రత్యేకత. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశాన్ని వెనక్కి తీసుకుపోయే పనిలో బిజీగా ఉన్నారు. ఒకాయన ఆవు పేడ అంటాడు, ఇంకొకాయన గోమూత్రం అంటాడు. అంతా ఆయుర్వేదంలోనే ఉందనే రాందేవ్‌బాబా ముఖ్య అనుచరుడు ఆరోగ్యం సరిగా లేకపోతే కార్పొరేట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతాడు.
వెనుకటికి మురార్జీదేశాయ్ (1977) జనతా ప్రధానిగా ఉన్నప్పుడు తన ఆరోగ్య రహస్యం స్వమూత్రసేవనం అని వార్తల్లోకి ఎక్కారు.
ఈ గణేష్‌సింగ్ లాంటి వాళ్లు చట్టసభల్లో ఎక్కువయ్యారు. సంస్కృతం కంపల్సరీ అని బిల్లు తెచ్చినా తెస్తారు వీళ్లు. కొలెస్టరాల్ తగ్గేది నిజమైతే సంస్కృత పండితులు గుండెపోటుతో చనిపోవడం జరగనే కూడదు, కానీ జరుగుతున్నాయి కదా!