చింతూరు వద్ద శబరి నదిపై లాంచీ ప్రమాదం జరిగింది. గోదావరి ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏసీ కోడేరు నుంచి ముగ్గురు వ్యక్తులు ఈ లాంచీలో వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే శబరి నదీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో శబరి వంతెనను లాంఛీ ఢీకొట్టి విరిగిపోయినట్లుగా తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో లాంచీలోని ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరిని సమీపంలోనే ఉన్న మరో లాంచీ వారు కాపాడినట్లుగా చెబుతున్నారు. ఇంకొక వ్యక్తి గల్లంతవ్వగా అతడి గురించి గాలింపు చర్యలు చేపట్టారు. రాంబాబు, సత్తిబాబు అనే వ్యక్తులను ప్రమాదం నుంచి బైటపడగా, పెంటయ్య అనే వ్యక్తి గల్లంతైనట్లుగా ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పోలీసు, రెవిన్యూ యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.