రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకులకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఫైర్ బ్రాండ్ నేతలు వాగ్దాటి కూడా ఒకింత ఎక్కువగా ఉంటుంది. అయితే నాయకుల భాష వారి పదవులకు వన్నె తెచ్చేలాగా ఉండాలి.
గత అసెంబ్లీలో అధికార టీడీపీ పార్టీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు,చింతమనేని ప్రభాకర్,అనిత తదితరులు వైసీపీ నేతల మీద చేసిన కామెంట్లు,ఉపయోగించిన తీవ్రపదజాలం ఆపార్టీ మీద తటస్థులలో కూడా వ్యతిరేకత పుట్టించింది. టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు కొడాలి నాని ,రోజా మీద టీడీపీ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు పట్టించుకోలేదు.దానికి ప్రధాన కారణం అధికారంలో ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకోవటమే. 2019 ఎన్నికల్లో టీడీపీ తీవ్ర పరాభవానికి వీరి దుర్భాషలు కూడా ఒక ముఖ్య కారణం.
గత మూడు నాలుగు రోజులుగా మరి టీడీపీ MLA వల్లభనేని వంశీ చేస్తున్న కామెంట్ల మీద జరిగతున్న చర్చ ఒక ఎత్తు అయితే ఆయన వాడుతున్న భాష మీద జరుగుతున్న చర్చ మరో ఎత్తు. పరిధిదాటి టీడీపీ నేతలు బాబు రాజేంద్రప్రసాద్,లోకేష్ మీద వంశీ చేసిన విమర్శల మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆయన ఇప్పటికీ వైసీపీలో చేరకపోయినా వంశీ చేస్తున్న విమర్శల ప్రభావం వైసీపీ మీద పడుతుంది. వంశీ రాజకీయ జీవితం మొదలయ్యింది టీడీపీతో. ఇప్పుడు విబేధాలు వొచ్చినంత మాత్రాన చంద్రబాబు మీద,లోకేష్ మీద వైసీపీ నేతలు కూడా చెయ్యని విమర్శలు వంశీ చేయటం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు.టీడీపీ నేతలు చేస్తున్న దాడి మీద సమన్వయం పాటించటం వంశీ బాధ్యత. వంశీ పార్టీ ఫిరాయింపుకు ఎన్ని కారణాలు చెప్పినా ,అవన్నీ నిజం అనుకున్నా టీడీపీ ఓడిపోకుంటే వంశీ పార్టీ మారేవాడా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది.విమర్శ-ప్రతి విమర్శలో అధికార పక్షానిదే ఎక్కువ బాధ్యత. “వంశీ వైసీపీకి మరో చింతమనేని అవుతాడా ” అన్న చర్చ సోషల్ మీడియాలో తీవ్రంగా జరుగుతుంది. ఈ చర్చ అటు వంశీకి కానీ ఇటు వైసీపీ కి కానీ మంచింది కాదు.
Also Read: యల”మంచి”లి పై వైసీపీ శ్రేణులకు ఎందుకంత కోపం ?
2004 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక ఇంటర్వ్యూలో వైస్సార్ నా “కోపం నరం తెగింది”అని అన్నారు. మంత్రి కొడాలి నాని ఈ మాటను వంటపట్టించుకోవాలి. ప్రతిపక్షంలో చేసినంత తీవ్ర ఎదురుదాడి మంత్రి అయిన తరువాత కూడా చేస్తే ప్రజలు హర్షించరు. కొడాలి నాని 2014-2019 మధ్య ఎదుర్కొన్న ఇబ్బందులు,చివరికి ఆఫీస్ ఖాళి చేసే విషయంలో కూడా పోలీసులు వ్యవహరించిన తీరు మీద ఆయన పట్ల ప్రజలలో ముఖ్యంగా గుడివాడ ప్రజలలో చాలా సానుభూతి ఉంది. కొడాలి నానినీ శాసనసభలో అడుగుపెట్టనియ్యకూడదని చంద్రబాబు స్వయంగా ఎంత ప్రయత్నం చేసిన రాష్టం మొత్తంలోనే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినా గుడివాడ ఓటర్లు మాత్రం నానీని ఆదరించి గెలిపించారు. జగన్ కూడా నానీ కమిట్మెంటును గుర్తించి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు నాని కోపం నరాన్ని తెంచుకోవాలి… గతంలో జరిగిన అవమానాలను,అణిచివేతను దిగమింగుకొని హుందాగా వ్యవహరించాలి.అదే నానీకి ,వైసీపీకి మంచిది .
Also Read: అలకబూనిన రాజేంద్రప్రసాద్
వైసీపీ కూడా పార్టీగా ప్రతి నాయకుడికి,నాయకురాలికి వ్యవహారశైలి మీద గైడ్లైన్స్ ఇవ్వాలి.ప్రతి నాయకుడు ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా వ్యవహరించాలి. ఓడిపోయిన పార్టీ గిల్లి,గిచ్చి అయినా సరే రెచ్చగొట్టాలని చూస్తుంది కానీ సమన్వయం పాటించవలసింది అధికారపార్టీ.
2019లో వైసీపీ సునామీలో గన్నవరం నుంచి గెలిచిన వంశీ కానీ,ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం,టీడీపీ కంచుకోట అయినా గుడివాడ నుంచి టీడీపీ ని ఓడించి రెండుసార్లు గెలిచిన కొడాలి నాని కానీ మరో రెండు,మూడు దశాబ్దాలు రాజకీయాల్లో ఉండవలసిన వారు. తదనుగుణంగా వ్యవహారశైలి మార్చుకోవాలి.
Also Read: వల్లభనేని వంశీ కేసులో నారా లోకేశ్ ఇరుక్కుంటాడా?