iDreamPost
iDreamPost
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ ఏర్పాటు చేసిన సభకు కొందరు ముఖ్యనేతలు హాజరవుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మందికి ఆహ్వానాలు అందాయి. విజయమ్మ తో పాటుగా షర్మిల కూడా కొందరికి స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానించారు. నోవాటేల్ వేదికగా హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సమావేశంలో పాల్గొనబోతున్నట్టు కొందరు నాయకులు ఇప్పటికే ప్రకటించారు.
వైఎస్ ఆత్మగా గుర్తింపు పొందిన మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు హాజరయ్యే ఆ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే ఆయన సన్నిహితులకు సమాచారం ఇచ్చారు. మరో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సిద్ధమయ్యారు. కేవీపీ కాంగ్రెస్ లో కొనసాగుతుండగా ఉండవల్లి మాత్రం ప్రస్తుతం రాజకీయపార్టీలకు అతీతంగా వ్యాఖ్యానాలు సాగిస్తున్నారు. వైఎస్సార్ కీలక అనుచరుల్లో వీరిద్దరూ ముఖ్యులే కావడం విశేషం.
తెలంగాణ కి చెందిన సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు రవి కూడా తాము హాజరవుతున్నట్టు ప్రకటించారు. టీపీసీసీ తరుపున ముఖేష్ గౌడ్ చేసిన ప్రకటనను విస్మరించి ఈ ఇద్దరు నేతలు హాజరయ్యేందుకు సిద్ధపడ్డారు.
విజయమ్మ సమావేశం రాజకీయ ప్రేరేపితం అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రకటించారు. కానీ కొందరు నాయకులు మాత్రం వైఎస్ తో తమ అనుబంధాన్ని పంచుకునేందుకు సిద్ధం కావడం విశేషం. ఏపీసిసి నుంచి కూడా కొందరు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక టీడీపీ లో ఉన్న వైఎస్సార్ సన్నిహితులు మాత్రం చంద్రబాబు ఆదేశాలతో దూరంగా ఉన్నారు. వైసీపీ కి చెందిన నేతలు కూడా ఆయా జిల్లాల్లో వర్ధంతి కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. వారు కూడా హైదరాబాద్ వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఇక ఎంఐఎం నేత అసదుద్దీన్ హాజరుకాలేనని ప్రకటించారు.
సమావేశం మాత్రం తెలుగు రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. చర్చించే అంశాలపై సర్వత్రా చర్చ సాగుతోంది.