కర్నూలు జిల్లా 14వ చైర్మన్‌గా సంజామల జెడ్పీటీసీ ఎం.వెంకటసుబ్బారెడ్డి ఎన్నిక అయ్యారన్న సంగతి తెలిసిందే. జిల్లాలోని నొస్సం గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి తండ్రి జయరామిరెడ్డి మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే జయరామిరెడ్డి ఇంటికి వైఎస్ చాలా సార్లు వస్తూ ఉండేవారు. వెంకటసుబ్బారెడ్డి కూడా జగన్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్ వెళ్లే సమయంలో నొస్సంలో ఆగి వెంకట సుబ్బారెడ్డి ఇంట్లో అల్పాహారం చేసేవారని చెబుతూ ఉంటారు. అలా తన తండ్రి సన్నిహిత కుటుంబానికి జగన్ ఇక్కడ చైర్మన్ గిరి అప్పగించారు.
అయితే అనూహ్యంగా వెంకట సుబ్బారెడ్డి తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. అయితే నిజానికి కొలిమిగుండ్ల జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రబోతుల వెంకటరెడ్డిని జెడ్పీ చైర్మన్‌గా గతంలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కొలిమిగుండ్ల జెడ్పీ స్థానం నుంచి పోటీలో ఉన్న వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల వాయిదా అనంతరం కొవిడ్ బారిన పడి ఎర్రబోతుల వెంకటరెడ్డి అదే ఏడాది సెప్టెంబర్ లో మరణించారు. ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. జెడ్పీ చైర్మన్ అభ్యర్థి మరణించడంతో ప్రత్యామ్నాయంగా మరొకరిని ఎంచుకోవాల్సి వచ్చింది. మరో వైపు ఎర్రబోతుల కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు జెడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాల్సి ఉంది. కానీ ఉప ఎన్నిక జరిగే వరకూ జెడ్పీ చైర్మన్‌గా మరొకరిని ఎన్నుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
దీంతో జగన్ తనకు సన్నిహితుడు అయిన వెంకట సుబ్బారెడ్డికి ఈ పదవి అప్పగించి ఎర్రబోతుల కుటుంబానికి తాను ఇచ్చిన మాట గురించి కూడా జగన్ చెప్పారు. ఈ క్రమంలోనే కొలిమిగుండ్ల జెడ్పీ స్థానం నుంచి ఎర్రబోతుల వెంకటరెడ్డి కుమారుడు ఎర్రబోతుల పాపిరెడ్డి గత నెలలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగన్ నుంచి ఆదేశాలు అందడంతో మల్కిరెడ్డి రాజీనామా చేశారు. వెంకటసుబ్బారెడ్డి కలెక్టర్ కోటేశ్వరావుకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు సుబ్బారెడ్డి ప్రకటించారు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే పాపిరెడ్డి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి బావమరిది. ఎమ్మెల్యే పినతండ్రి కుమారుడు ప్రసాద్ రెడ్డికి పాపిరెడ్డి స్వయాన మామ కుమారుడు. అయితే తనకు సన్నిహితుడు అయిన మల్కిరెడ్డికి భవిష్యత్తులో జగన్ మంచి పదవి ఇస్తారని అభిమానులు భావిస్తున్నారు.
Also Read : యర్రబోతుల వెంకటరెడ్డి మరణం