iDreamPost
iDreamPost
ఏపీలో మునిసిపల్, పంచాయతీలకు సంబంధించి ఖాళీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఇది టీడీపీకి దాదాపు సెమీ ఫైనల్స్ అన్నట్టుగా మారింది. ఆపార్టీ అధినేతకి ఇది అత్యంత క్లిష్ట పరిస్థితిని తీసుకొస్తోంది. దాంతో టీడీపీ నేతలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. కుప్పంలో గట్టెక్కాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు ఏకంగా మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఆపార్టీకి చెందిన పలువురు నేతలు కుప్పంలో పాగా వేశారు. ఎన్నికల ప్రణాళికలు వేస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి ముప్పు తిప్పలు పడుతున్నారు.
కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలకు టీడీపీ అంత ప్రాధాన్యతనివ్వడం ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అది వారికి అనివార్యం అన్నట్టుగా మారింది. ఇప్పటికే గడిచిన సాధారణ ఎన్నికల్లో నారా లోకేష్ ఖంగుతినడంతో కలిగిన నొప్పి ఇప్పటికీ తగ్గలేదు. మంగళగిరి ఓటమి టీడీపీని తీవ్రంగా ఇరకాటంలోకి నెట్టింది. చంద్రబాబు తర్వాత అంతటి నాయకుడిగా లోకేష్ ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తుండగా 2019 ఎన్నికల్లో స్వయంగా ఆయనే ఓడిపోవడం కుంగతీసింది. టీడీపీకి వారసుడు లేడనే వాదన బయటకు తచ్చింది. లోకేష్ నాయకత్వం మీద సందేహాలు పెంచింది. చంద్రబాబు తదనంతరం మళ్ళీ నందమూరి వారసులు రావాల్సిందేననే అభిప్రాయం బలపరిచింది. నారా వారబ్బాయిని నానా రకాలుగా చిక్కుల్లో నెట్టింది.
ఇప్పుడు కుప్పంలో మునిసిపాలిటీ చేజారిపోతే టీడీపీకి ఇక ఏపీలో పుట్టగతులుండవనే అంచనాలు పెరుగుతున్నాయి. చంద్రబాబు తర్వాతే కాదు.. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో కూడా టీడీపీకి మనుగడ కష్టమేననే అభిప్రాయం బలపడుతోంది. కుప్పం పంచాయితీ పోరులో టీడీపీ చతికిలపడింది. పరిషత్ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఇప్పుడు కుప్పం పట్టణం కూడా కోల్పోతే చంద్రబాబుకి కుప్పం ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే టీడీపీ ఏపీ అంతటా తలెత్తుకోలేని స్థితి ఖాయం. అందుకే కుప్పంలో వైఎస్సార్సీపీని అడ్డుకోవాలని అహర్నిశలు శ్రమిస్తోంది. అందుకు అనువుగా అనేక మార్గాలు అన్వేషిస్తోంది. టీడీపీతో అసంతృప్తిగా ఉన్న నేతలను మచ్చిక చేసుకునేందుకు పెద్ద మొత్తంలో వెచ్చించడానికి సిద్ధమయ్యింది. ఏది చేసినా ఓటమి బారిన పడకూడదనే లక్ష్యంతో ఉంది.
కుప్పం ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడింత ప్రాధాన్యతను సంతరించుకోవడం చంద్రబాబుకి చికాకుగానే చెప్పాలి. 2019 ఎన్నికల కౌంటింగ్ లోనే బాబుకి చుక్కలు చూపించే రోజులు వస్తున్నాయని స్పష్టమయ్యింది. ఇటీవల స్థానిక ఎన్నికలు దానికి సాక్ష్యంగా ఉన్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీలో అధికారం తర్వాత గానీ ముందు కుప్పంలో చంద్రబాబు ఓడిపోకుండా చూసుకోవాలంటే ఇప్పుడు ఎన్నికల్లో ఏదో రకంగా పట్టు నిలుపుకోవాల్సి ఉంటుంది. లేదంటే చేజారిపోతున్న కుప్పం కోటను కాపాడుకోవడం ఆపార్టీ తరం కాదు. అందుకే కుప్పం మునిసిపల్పోరుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పట్టుదలతో సాగుతోంది. ప్రతికూల పరిస్థితులున్న తరుణంలో గట్టెక్కేందుకు యత్నిస్తోంది. కానీ పరిస్థితి సానుకూలంగా మారకపోవడం టీడీపీని కలవరపరుస్తోంది