విశాఖ స్టీల్ ప్యాక్టరీ ప్రయివేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు విశాఖ స్టీల్ ను ప్రైవైట్ పరం చెయ్యొద్దని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. విశాఖ ఎంపీ ,వైసీపీ నేత అవసరం అయితే రాజీనామా చేస్తానని ప్రకటించారు. బీజేపీ మిత్రపక్షం జనసేన కూడా విశాఖ స్టీల్ ను కాపాడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. టీడీపీ మాత్రం అసలు విషయాన్ని వదిలి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేసింది. శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కె .రామ్మోహన్ నాయుడు వైసీపీ ప్రభుత్వం వలనే స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరుగుతుందని , జగన్ కు విశాఖ ఉక్కు సెగ తగలనున్నదని ఆరోపించారు .
వారసులు రాజకీయాల్లోకి రావటం కొత్తా కాదు, తప్పూ లేదు . రాజకీయాల పట్ల , ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండాలి,కనీస పరిజ్ఞానం ఉండాలి . ఇవేవీ లేకుండా వారసులమంటూ జబ్బలు చరుచుకొంటూ రాజకీయాల్లోకి వచ్చేవారి వలన ఏ మాత్రం ప్రయోజనం లేకపోగా సమస్యలను పక్కదారి పడుతాయి. .
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ ప్రతి ఆంధ్రుణ్ణి బాధించే అంశం . ప్రజలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు స్పందించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది . దాన్ని వదిలేసి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టకుండా ఆ నిర్ణయంతో ఏ మాత్రం సంభందం లేని రాష్ట్ర ప్రభుత్వాన్ని , ముఖ్యమంత్రి జగన్ ని రామ్మోహన్ నాయుడు విమర్శించడం అర్ధరహితమే కాదు అతని అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తుంది . ఇలాంటి చర్యల వలన ప్రజల్లో నవ్వులపాలు కావటం తప్ప మరో ప్రయోజనం లేదు .
గతంలో కూడా రామ్మోహన్ నాయుడు ఇలా అవగాహన లేకుండా మాట్లాడి నవ్వులపాలైన దృష్టాంతాలు ఉన్నాయి . గత ఏడాది ఏప్రిల్ 30న తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుణ్ణి చెప్పుకున్న ఒక వ్యక్తి ఒక్కపూట ఇండోర్ నిరాహార దీక్షకి పూనుకొన్నాడు . ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు అతనికి ఫోన్ చేసి ఏ డిమాండ్స్ తో దీక్ష చేస్తున్నావు అని అడగ్గా , నిరుద్యోగ భృతి మూడువేలు ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండు నెలల్లో నిరుద్యోగ భృతి ఇవ్వలేదని తక్షణమే ఆ పదకొండు నెలల బకాయి 33 వేల చొప్పున నిరుద్యోగులందరికీ ఇచ్చేస్తే లాక్ డౌన్ లో ఖర్చులకు వాడుకొంటారన్నది నా ప్రధాన డిమాండ్ అని ఇతను మీడియా ముఖంగా స్పీకర్ అన్ చేసి ఎంపీకి వివరించాడు .
మొత్తం విన్న రామ్మోహన్ నాయుడు మంచి పని చేస్తున్నావు అంటూ అభినందించి నీ వెనక మేమంతా ఉన్నాం పోరాడు అంటూ ఒక్కపూట దీక్షకి సంఘీభావం తెలిపి ప్రోత్సహించాడు . అసలా హామీ వైసీపీ ఇచ్చిందా , నిరుద్యోగ భృతి ఎవరి హామీ , నిరుద్యోగ భృతి ఇస్తామని వంచించింది ఎవరు లాంటి కనీస పరిజ్ఞానం లేకుండా ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలు అతన్నే కాకుండా గతంలో ఆ హామీ ఇచ్చి నిరుద్యోగుల్ని వంచించిన టీడీపీ అధినేత చంద్రబాబుని కూడా నవ్వులపాలు చేసాయి .
2014 లో 12.26 లక్షల మందికి రెండు వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు 2019 ఫిబ్రవరి వరకూ ఈ పథకం నిర్వహించే ప్రయత్నం చేయకుండా ఎన్నికలకు నాలుగు నెలల ముందు 1.83 వేల మందిని లబ్దిదారులుగా ప్రకటించి వెయ్యి రూపాయలు చొప్పున పంపిణీ చేశారు . దీని పై సర్వత్రా విమర్శలు రావడంతో తర్వాతి నెలలో రెండు వేలకి పెంచి మొత్తంగా నాలుగు నెలలు భృతి పంపిణీ చేశారు . కనీసం ఈ గత చరిత్ర తెలియకుండా వైసీపీ ప్రధాన హామీలైన నవరత్నాలలో కానీ , ఒకే పేజీ ముందు వెనకలుగా ఉన్న మేనిఫెస్టోలో కానీ నిరుద్యోగ భృతి అనే హామీ లేదన్న విషయం పట్ల కనీసపు అవగాహన లేకుండా ప్రభుత్వ హామీ కాని అంశాన్ని అసత్యాలతో ప్రభుత్వానికి అంటగట్టి ప్రయోజనం పొందుదామనుకొన్న ఓ వ్యక్తి ప్రయత్నాన్ని ఒక ఎంపీ ఇలా సమర్ధించిన అమాయకత్వం అప్పట్లో నవ్వులపాలైంది .
టీడీపీ హామీ ఇచ్చిన నాటి నుండి లెక్కిస్తే 14500 కోట్ల మేర నిరుద్యోగులకు చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసినట్లు అయ్యింది . వీటికి నీ సమాధానం ఏంటి రామ్మోహన్ నాయుడూ అని నెటిజన్లు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక మౌనం వహించడం టీడీపీ వంతు అయ్యింది . తరిచి చూస్తే టీడీపీ అధినేత నుండి కొందరు నేతల వరకూ ఇలా ఆలోచన లేకుండా నోరు జారి ఆనక నాలుక్కరుచుకొన్న అంశాలు కోకొల్లలు .
దున్న ఈనిందంటే దూడని గోడవారగా నీడన కట్టెయ్యమనే అమాయక వారసులు చేసే ఇలాంటి అసందర్భ ఆరోపణల వలన ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదు కానీ వాళ్ళ అమాయకత్వం చూసి నవ్వుకోవటానికి పనికివస్తాయి .