iDreamPost
android-app
ios-app

Kotia Villages – ఒడిశా పథకాలు మాకొద్దు.. ఆంధ్ర పాలనే ముద్దు

  • Published Oct 17, 2021 | 6:49 AM Updated Updated Oct 17, 2021 | 6:49 AM
Kotia Villages – ఒడిశా పథకాలు మాకొద్దు.. ఆంధ్ర పాలనే ముద్దు

ఆంధ్ర -ఒడిశా సరిహద్దుల్లోని కొటియా గ్రామాల్లో మళ్లీ ఒడిశా ప్రజాప్రతినిధులు కవ్వింపులకు పాల్పడుతున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లోకి వెళ్లి హడావుడి చేస్తున్నారు. అయితే కొటియా ప్రజలు ఈ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీ పథకాలు వద్దు.. మీ ఎన్నికలు వద్దు.. తామంతా ఆంధ్రలోనే ఉంటామని, ఆ ప్రభుత్వ పథకాలే తమకు నచ్చాయని స్పష్టం చేశారు. ఈ మేరకు పది గ్రామాల ప్రజలు సమావేశమై తీర్మానాలు కూడా చేశారు. ఈ పరిణామాలు మింగుడు పడని ఒడిశా ప్రజాప్రతినిధులు ఉద్రిక్తతలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. తమ రాష్ట్ర పరిధిలో ఉన్న సెల్ టవర్ నుంచి సిగ్నల్స్ కూడా నిలిపివేశారు.

కోటియాపై పెత్తనానికి తొలి నుంచీ కుట్రలు

ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న సరిహద్దు వివాదంపై ఒడిశా మొదటి నుంచీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. పరస్పర చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకునే వరకు 21 కొటియా గ్రామాల్లో రెండు రాష్ట్రాలు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టరాదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీన్ని పట్టించుకోకుండా ఒడిశా ప్రభుత్వం ఈ గ్రామాల్లో పలు పనులు చేపట్టి స్థానికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడు పెంచింది. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ కొటియా గ్రామాలకు కూడా వర్తింపజేసింది. పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తరచూ ఆ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు అందిస్తూ కొటియా ప్రజల మనసులు చురగొన్నారు. దాంతో రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఒడిశా ప్రజాప్రతినిధులు, అధికారులను ఎదిరించి మరీ వారంతా ఎన్నికల్లో పాల్గొన్నారు.

Also Read : RK సార్‌, సెల‌వు!

ఒడిశాలో ఎన్నికలు.. ఇక్కడ హడావుడి

కాగా ఒడిశాలో స్థానిక సంస్థల ఎన్నికలు కొద్దిరోజుల్లో జరగనున్నాయి. దాంతో సరిహద్దు ఒడిశా జిల్లా అయిన కోరాపుట్ ప్రజాప్రతినిధులు తరచుగా గ్రామాల్లోకి వస్తూ హడావుడి చేస్తున్నారు. అయితే కొటియా ప్రజలు ఒడిశా పట్ల విముఖత చూపుతున్నారు. కొద్దిరోజుల క్రితం పగులు చెన్నూరు, పట్టు చెన్నూరు తదితర పది గ్రామాల ప్రజలు పగులు చెన్నూరులో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఒడిశా ఎన్నికల్లో పాల్గొనరాదని తీర్మానం చేశారు. ఆంధ్ర పథకాలు బాగున్నాయని, ఒడిశా పథకాలు ఇకనుంచి తీసుకోరాదని నిర్ణయించారు. తాము ఆంధ్రలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఒడిశా ఎమ్మెల్యేపై తిరుగుబాటు

సమావేశం జరుగుతున్న సమయంలో విషయం తెలుసుకున్న కోరాపుట్ జిల్లా పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతం పాడి తన అనుచరులతో పగులు చెన్నూరు చేరుకుని పీవో కూర్మనాథ్ తో గొడవకు దిగారు. ఆంధ్ర అధికారులకు ఇక్కడ ఏం పని అని నిలదీశారు. స్థానిక ప్రజలు పీవోకు అండగా నిలిచి ఎమ్మెల్యేపై తిరగబడ్డారు. తాము ఆంధ్రలోనే ఉంటామని స్పష్టం చేశారు. ఒడిశా పథకాలు అక్కర్లేదు.. ఎన్నికల్లోనూ పాల్గొనబోమని స్పష్టం చేశారు. ఎన్నికల పేరుతో తమ గ్రామాల్లోకి రావద్దని హెచ్చరించారు. దాంతో కక్షబూనిన ఎమ్మెల్యే ఒడిశా పరిధిలో ఉన్న సెల్ సిగ్నల్స్ అందకుండా రెండు రోజులు ఇబ్బందిపెట్టారు. అయినా స్థానికులు లొంగకపోవడంతో విధిలేక నెట్వర్క్ పునరుద్ధరించారు.

Also Read : Sasikala – అరవ రాజకీయాల్లో చిన్నమ్మ మళ్లీ సందడి.. ?