ఎదో సినిమాలో Don’t fire the fire
If you fire the fire, fire will fires you.
I’m not the fire. I’m the Truth అని హీరో అంటాడు.
ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో నేనే ఫైర్ అనే చింతమనేని ప్రభాకర్ ఈ రోజు జైలు నుంచి విడుదలైన సందర్భంలో దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి తండ్రి రామచంద్రరావు బస్తీమే సవాల్ అని ఛాలెంజ్ విసిరాడు.
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజవర్గ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. అరవై ఆరు రోజుల జైలు జీవితానంతరం వివాదాస్పద దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే! ఆ సందర్భంగా ఆయన తనను తానో శాంతికాముకిడిగా చిత్రీకరించుకుంటూనే…సీఎం జగన్‌తోపాటు అధికార పార్టీ నాయకులు, పోలీసులపై ఆరోపణలు గుప్పించారు. దీంతో దానికి ప్రతిగా దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు(ఎమ్మెల్యే తండ్రి), ఇతర నాయకులు పెదవేగి మండలం జానంపేటలోని ఇసుక డంపింగ్ యార్డు వద్ద పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరీ చింతమనేనిపై విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా కొఠారు రామచంద్రరావు మాట్లాడుతూ తన వయసు 65 ఏళ్లని…ఏదైనా ఉంటే నేరుగా చూసుకుందామని చింతమనేనికి సవాల్ విసిరారు. ఏటా సంక్రాంతి సందర్భంగా చింతమనేని ప్రత్యేక బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహిస్తుంటాడని…ఈసారి కోళ్లకు బదులు బరిలో మనమిద్దరం చూసుకుందామా అంటూ చింతమనేనిపై శివమెత్తారు. తాను అయ్యప్ప మాలలో ఉన్నానని, మాల తీసిన వెంటనే చింతమనేనితో మల్లయుద్ధానికైనా, కర్రసాముకైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు. అనంతరం ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ చింతమేని, అతని లాయరు ఈడ్పుగంటి శ్రీనివాసరావులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. మీ తాటాకు చప్పళ్లకు బయపడేవారు ఎవరూ లేరని హెచ్చరించారు. ఈవీఎంల కారణంగా ఓడిపోయాననే చింతమనేని వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని పరిహసించేలా ఉన్నాయన్నారు.