iDreamPost
android-app
ios-app

కోట వెరైటీ విలనీకి పరాకాష్ట – Nostalgia

  • Published Jul 10, 2020 | 1:08 PM Updated Updated Jul 10, 2020 | 1:08 PM
కోట వెరైటీ విలనీకి పరాకాష్ట – Nostalgia

కమర్షియల్ సినిమాలో హీరో పాత్ర ఎలివేట్ కావాలంటే విలన్ ఖచ్చితంగా శక్తివంతుడు, బలవంతుడు అయ్యుండాలి. అప్పుడే మాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేయగలుగుతారు. దీనికిగాను ఆర్టిస్ట్ కి దిట్టమైన శరీర సౌష్టవం ఉంటే సరిపోదు. టైమింగ్ ఉండాలి. ఆ పాత్రకు తగ్గ సెన్స్ కావాలి. అలాంటి గొప్ప నటులను లిస్టు చేసుకుంటే అందులో ఖచ్చితంగా టాప్ టెన్ లో ఉండే పేరు కోట శ్రీనివాసరావు. 1978లో చిరంజీవి టైంలో ప్రాణం ఖరీదుతో తెరంగేట్రం చేసిన కోట శ్రీనివాసరావు మొదట్లో చిన్న వేషాలు చాలా వేశారు కాని తొలి బ్రేక్ మాత్రం 1986లో టి కృష్ణ తీసిన ప్రతిఘటనలో సీనయ్య పాత్ర ద్వారా దక్కింది.

అక్కడి నుంచి కెరీర్ ఊపందుకుని చెప్పుకోదగ్గ పాత్రలు వచ్చాయి కానీ మరో మేలి మలుపుగా నిలిచింది మాత్రం 1991లో వచ్చిన శత్రువు. అందులో వెంకటరత్నంగా కోట పండించిన విలనీ వెంకటేష్, విజయశాంతిలకు ధీటుగా పేరు తేవడం అతిశయోక్తి కాదు. థాంక్స్ అనే ఊతపదంతో ఎక్కువ అరుపులు లేకుండా పైపెచ్చు కామెడీ చేస్తూ చాలా డిఫరెంట్ గా ఉన్న రోల్ ని డిజైన్ చేశారు రచయిత సత్యమూర్తి, దర్శకులు కోడి రామకృష్ణ. మెయిన్ విలన్ గా కెప్టెన్ రాజు చేసినప్పటికీ అందరికీ కోటనే అలా గుర్తుండిపోయారు. ఇందులో ఆయనది రెగ్యులర్ వేషం కాదు. ఎంత వెరైటీ అంటే లాయర్ విజయ్ కుమార్ ని చంపే సీరియస్ సీన్లోనూ నవ్వుతూ నుదుటన బొట్టు పెట్టుకుని నవ్వుతు థాంక్స్ చెప్పి ఒళ్ళు జలదరించేలా చేయడం ఆయనకే చెల్లింది. మరో మంచి ఉదాహరణ కూడా ఉంది.

తన మీద పగతో చంపి ప్రతీకారం తీర్చుకోవాలని వెతుకుతున్న హీరోకు దొరక్కుండా కోట ఓ పెద్ద బిల్డింగ్ లో దాచుకుంటాడు. భయం ఎక్కువైపోయి అతను రాకున్నా వచ్చినట్టు ఊహించుకుని ప్రవర్తించే సన్నివేశం గురించి ఎంత చెప్పినా తక్కువే. తర్వాత సీన్లో నిజంగానే హీరో వచ్చి కొడుతున్నా ఇది కలే కలే అని నవ్వుతూ చెలరేగడం కూడా ఓ రేంజ్ లో పండింది. అందుకే శత్రువు తర్వాతే కోట శ్రీనివాసరావు గారి ఇన్నింగ్స్ రాకెట్ స్పీడ్లో వేగమందుకుంది. ఇప్పుడున్న బాలీవుడ్ విలన్ల తరహాలో డబ్బింగ్ మీదే ఆధారపడకుండా ముఖకవళికల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న కోట శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఇలాంటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వయసు మీద పడుతున్నా ఇప్పటికీ మేకప్ కు రెడీ అంటున్న కోట ఎందరికో ఆదర్శం.