Idream media
Idream media
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకంపై ఆది నుంచీ ఆరోపణలు తారాస్థాయిలో వినిపిస్తున్నాయి. రేవంత్ నియామకం ప్రకటన అనంతరం ఢిల్లీ నుంచి శంషాబాద్ చేరుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిపోయిందంటూ నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులా.. పీసీసీ పదవి కేటాయింపులో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పీసీసీ పదవిని అమ్ముకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. సొంత పార్టీ నేతే ఇన్ చార్జిపై చేసిన ఈ వ్యాఖ్యలు ఓ రేంజ్ లో కలకలం రేపాయి.
ఇప్పుడు తాజాగా టీఆర్ఎస్ నేతలు కూడా మాణిక్కం ఠాగూర్ పై ఆరోపణలు చేస్తున్నారు. వారైతే ఎన్ని కోట్లు తీసుకున్నారో కూడా చెప్పేస్తున్నారు.పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తర్వాత రేవంత్ దూకుడు పెంచారు. అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.
పార్టీ ఫిరాయించిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు దీటైన కౌంటర్ ఇచ్చారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నోరుంది కదా అని ఏదైనా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి పార్టీ మారిన వాళ్లని రాళ్లతో కొట్టి చంపాలని అంటున్నాడని, మీరు రాళ్లతో కొడితే తాము చెప్పులతో కొడతామని తీవ్రంగా హెచ్చరించారు. టీపీసీసీ పదవి రాకపోతే రేవంత్‌రెడ్డి పార్టీ మారే వారు కాదా? అని ఆయన ప్రశ్నించారు.
తాము రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం టీఆర్ఎస్‌లో వీలినం చేశామని చెప్పుకొచ్చారు. తమవి సేవా రాజకీయాలని, నీవి స్వార్థ రాజకీయాలు అని రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్‌కి రూ. 25 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నావని తీవ్ర ఆరోపణలు చేశారు. కోమటిరెడ్డి అమ్ముకున్నారని ఆరోపిస్తే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంత తీసుకున్నారో కూడా చెబుతున్నారు. ఇది నిజామా, కాదా అన్న సంగతి పక్కనబెడితే.. పీసీసీ చీఫ్ ఎంపిక మాణిక్కం ఠాగూర్ కు మాత్రం గట్టి తలనొప్పులే తెచ్చింది. తీవ్రస్థాయిలో మేథోమథనం చేసి ప్రకటించామని ఆయన చెబుతున్నా, డబ్బు తీసుకుని రేవంత్ కు కట్టాబెట్టారన్న వాఖ్యలు చాపకింద నీరులా విస్తరిస్తుండడం గమనార్హం.