ఎప్పుడెప్పుడా అని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న రాజమౌళి కాంబినేషన్ ని గత ఏడాది టీవీ వేదికగా సాక్ష్యాత్తు జక్కన్నే ప్రకటించడంతో అప్పటి నుంచి అభిమానులు దాని మీద విపరీతమైన అంచనాలు పెట్టేసుకుంటున్నారు. ఒకవేళ లాక్ డౌన్ రాకుండా ఆర్ఆర్ఆర్ ఈపాటికే విడుదలై ఉంటే సర్కారు వారి పాట కన్నా ముందు ఇదే ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కేదేమో. కానీ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. మాములుగా రాజమౌళితో మూవీ అంటే ఏ హీరో అయినా ఖచ్చితంగా రెండు మూడేళ్లు త్యాగం చేయాల్సిందే. ఎంత ప్లాన్డ్ గా ఉన్నా సరే మురారి సినిమాలో శాపం లాగా ఏవో కారణాల వల్ల ఆలస్యమవుతూనే ఉంటుంది.
అందుకే సర్కారు వారి పాటతో పాటు ఓ రెండు సినిమాలు చేసి విడుదలకు రిజర్వ్ లో ఉంచి ఆపై రాజమౌళితో టై అప్ అవ్వాలనే ఆలోచనలో ప్రిన్స్ ఉన్నట్టు వినికిడి. అందులో భాగంగానే ఇటీవలే ఆకాశం నీ హద్దురాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన సుధా కొంగరతో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆవిడ ఇప్పటిదాకా ఏ హీరోకు కమిట్ మెంట్ ఇవ్వలేదు. విజయ్ తో ఉంటుందన్నారు కానీ ఆయన నెల్సన్ వైపు మొగ్గు చూపడంతో సుధా మరో స్టార్ హీరో అన్వేషణలో ఉంది. ఒక లైన్ మహేష్ కి నచ్చినట్టు దుబాయ్ నుంచి రాగానే ఓ డిస్కషన్ జరిగేలా ఇప్పటికే అనుకున్నారట.
తనతో పాటు ఖాకీ ఫేమ్ వినోత్ కూడా మహేష్ కోసం ఒక మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ సిద్ధం చేసినట్టు వినికిడి. ఇతను ప్రస్తుతం అజిత్ తో వలిమై చేస్తున్నాడు. ఇందులో ఆరెక్స్ 100 కార్తికేయ విలన్. షూటింగ్ చివరి దశలో ఉంది. వేసవి విడుదలకు ప్లాన్ చేశారు. ఇదయ్యాక ఇంకెవరితో చేయాలనే క్లారిటీ లేదు. ఇతను కూడా మహేష్ నే టార్గెట్ చేసినట్టుగా తెలిసింది. అయితే గతంలో తమిళ దర్శకులను గుడ్డిగా నమ్మడం వల్ల ప్రిన్స్ కు స్పైడర్, నాని లాంటి డిజాస్టర్స్ రూపంలో మంచి అనుభవాలు ఉన్నాయి. అందుకే ఈసారి ఆచి తూచి మరీ అడుగులు వేస్తున్నారు. సర్కారు ఓ పావు వంతు అయ్యాక ఇక్కడ చెప్పినవాటి గురించి క్లారిటీ రావొచ్చు