iDreamPost
iDreamPost
రాజధాని నయా ఉద్యమకారుడి పేరిట పలు టివి షోల్లో చేసిన పోరాటం ముగిసినట్లేనా.. టీడీపీ బీజేపీతో విభేదించిన తర్వాత ఓ లైవ్ డిబేట్ లో బిజెపి నేతని చెప్పుతో కొట్టిన టీడీపీ కొత్త నాయకుడి ప్రస్థానానికి తెర పడినట్లేనా.. అమరావతి పోరాటం పేరిట బాబు సహా పలువురు చేస్తున్న వసూళ్ల వ్యాపారం బట్టబయలవ్వబోతుందా..? ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తుంది . వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ ప్రతిపాదనల్లో భాగంగా మూడు రాజధానుల అంశం ప్రస్తావనకు రాగానే ఉలిక్కిపడ్డ టీడీపీ పార్టీ అమరావతి ఏకైక రాజధానిగా ఉంచాలంటూ డిమాండ్ చేయటం , అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ పేరిట టీడీపీ ప్రేరేపిత ఉద్యమం లేవనెత్తటం లాంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి .
ఈ క్రమంలో అమరావతి ఉద్యమ నిర్వాహకుల పేరిట పోరాట కమిటీలు , పరిరక్షణ సమితులు వాటికి అధ్యక్షుల పేరిట టీడీపీ తరుపున పలువురు కొత్త కొత్త వ్యక్తులు రంగప్రవేశం జరిగింది . అలా వచ్చిన వారిలో కొందరు దూకుడైన మాటతీరుతో , దుందుడుకు చర్యలతో చంద్రబాబు దృష్టిని ఆకర్షించి ఉద్యమ సారధులుగా , టీవీ డిబేట్లలో అమరావతి గురించి ఘాటుగా వాదించే వక్తలుగా ఎదిగారు .
అలా పరిణామం చెందిన వారిలో ఒకడే ఈ కొలికిపూడి శ్రీనివాస్ . హైదరాబాద్లో లెక్చరర్ గా జీవనం కొనసాగిస్తున్న శ్రీనివాస్ గతంలో అడపాదడపా రాజకీయాల గురించిన టీవీ డిబేట్లలో కనపడ్డాడు కానీ అమరావతి పేరిట టీడీపీ నేతలు ఉద్యమం మొదలెట్టిన తర్వాత కొన్నాళ్ళకి జాయిన్ అయిన కొలికపూడి ఈ ఉద్యమాన్ని ఫుల్ టైం జాబ్ గా తీసుకొన్నాడు అని చెప్పొచ్చు . కేపిటల్ ఏరియాలో టీడీపీ జరిపిన పలు ఆందోళనల్లో ముందు వరుసలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిస్తూ నాయకుల దృష్టిని ఆకర్షించిన ఇతను పలు టివి డిబేట్లలో పాల్గొని అమరావతికి విరుద్ధంగా మాట్లాడిన వారి పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాక ఉద్యమ తీరు , అందులోని ఆర్ధిక అంశాల్ని ప్రశ్నించిన బిజెపి నేతని ఓ లైవ్ డిబేట్లోనే చెప్పుతో కొట్టటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది .
Also Read : బీజేపీతో ‘గాంధీ’ల బంధం ముగియనున్నదా ?
ఈ ఘటనని సమర్ధించుకొన్న టీడీపీ పార్టీ కొలికపూడికి మరింత ప్రాచుర్యాన్ని కల్పించడమే కాక టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని వైసీపీలో సామాన్య కార్యకర్త స్థాయి నుండి ఎంపీగా ఎదిగిన దళిత నేత నందిగం సురేష్ లాగా నీకు కూడా బాపట్ల నుండే అవకాశం కల్పిస్తామని అధిష్టానం నుండి హామీ లభించినట్లు టీడీపీ శ్రేణుల్లో చర్చ నడిచింది .
ఈ పరిణామాలు రుచించని టీడీపీలోని ఓ ఎన్నారై వర్గం శ్రీనివాస్ వ్యక్తిగత లావాదేవీల గురించి , అమరావతి పరిరక్షణ పేరిట వ్యక్తిగతంగా అతను చేస్తున్న వసూళ్ల గురించి స్థానిక టీడీపీ మిత్రులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక నేత ఒకరు కొలికపూడి పై సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తదనంతరం పరస్పర ఫోన్ కాల్స్ లో శ్రీనివాస్ కొందరు టీడీపీ సానుభూతిపరుల్ని , మహిళల్ని చందాలు అడిగి డబ్బు సేకరిస్తున్న విషయాలు కాల్ రికార్డ్స్ లో బయట పడడంతో అలక వహించిన కొలికపూడి శ్రీనివాస్ తాను అమరావతి ఉద్యమం నుండి తప్పుకొంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు .
అయితే అమరావతి ఉద్యమం పేరిట పార్టీ అధినేత చంద్రబాబు , ఆయన తనయుడు లోకేష్ లు స్వయంగా జోలె పట్టి టీడీపీ శ్రేణుల నుండి పెద్ద మొత్తంలో డబ్బు , బంగారం వసూలు చేసి ఉద్యమానికి ఖర్చు చేస్తుండగా , మళ్లీ కొలికపూడి వ్యక్తిగతంగా వసూళ్లు చేయడం అందునా మహిళల్ని డబ్బు ఇమ్మని డిమాండ్ చేయటం ఏమిటని , అసలు ఉద్యమం కోసం వసూలు చేసిన డబ్బు , పెట్టిన ఖర్చు వివరాలు లెక్క తేల్చాలని టీడీపీ లోని ఓ వర్గం డిమాండ్ చేస్తుండగా , కొలికపూడి వసూళ్లు అతని వ్యక్తిగతమని అందులో తప్పేంటని మరో వర్గం అతనికి అండగా నిలబడింది .
అయితే దళితుడైన కొలికపూడి ఎదుగుదల ఓర్వలేని కొందరు టీడీపీ నాయకులు వ్యూహాత్మకంగా అతని లావాదేవీలు బయట పెట్టి పరువు తీశారని టీడీపీలో కొన్ని వర్గాలని తప్ప మిగతా వారిని ఎదగనివ్వరని ఇప్పుడే కాదు గతంలో కూడా పలువురు దళిత నాయకుల్ని వాడుకొని తరువాత పక్కన పెట్టటం చంద్రబాబుకి , ఇతర టీడీపీ నాయకులకి అలవాటే అని కొలికపూడి సానుభూతిపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
Also Read : తప్పుడు నిర్ణయాలతో రాజకీయ భవిష్యత్తు కోల్పోయిన వంగవీటి రాధా