తెలంగాణ ఆర్టీసీ సమ్మె విరమణ అంశం పై గురువారం కీలకమైన ముందడుగు పడింది. చర్చలకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ప్రకటన చేసిన టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఎంపీ కే కేశవరావు… రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తో కలసి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఆర్టీసీ జేఏసీతో చర్చల అంశాన్ని కేకే.. కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి సమ్మతమైతే.. ఆర్టీసీ జేఏసీతో చర్చలకు తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని కేకే కేసీఆర్‌తో పేర్కొన్నట్టు సమాచారం.
ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలకు హైకోర్టు విధించిన డెడ్‌లైన్ శుక్రవారంతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో కేకే భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 18వ తేదీ కల్లా చర్చలు ముగించి.. శుభవార్తతో రావాలని అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్టీసీ జేఏసీకి హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే.