iDreamPost
iDreamPost
2005లో వచ్చిన చంద్రముఖి సంచలనం గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది. అప్పటిదాకా ఉన్న డబ్బింగ్ సినిమాల రికార్డులను బద్దలు కొట్టి లకలకలక అంటూ రజనీకాంత్ చేసిన యాక్షన్, వారా అంటూ జ్యోతిక ఇచ్చిన సూపర్బ్ పెర్ఫార్మన్స్ కి థియేటర్లు ఊగిపోయాయి. తమిళనాడులో ఎనిమిదివందల రోజులు ప్రదర్శింపబడి అక్కడా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. దీని సీక్వెల్ కోసం అభిమానులు పదిహేనేళ్ళుగా ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ నిరీక్షణ ఫలించనే లేదు. మధ్యలో కన్నడలో విష్ణువర్ధన్ తో, తెలుగులో వెంకటేష్ (నాగవల్లి)తో ఇదే కథను తిప్పి తీసి ప్రయోగం చేశారు కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు నిజమైన కొనసాగింపు రాబోతున్న సంగతి తెలిసిందే.
దర్శకుడు పి వాసు ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేశారని చెన్నై టాక్. మొదటిసారి రజినీకాంత్, లారెన్స్ కలిసి నటించబోతున్నారు. ఈ వార్త వచ్చినప్పటికీ నుంచే ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. తాజాగా హీరోయిన్ ని లాక్ చేసినట్టుగా తెలిసింది. భరత్ అనే నేను, వినయ విధేయ రామలతో మనకూ పరిచయమున్న కియారా అద్వానీని ఒప్పించినట్టుగా వినికిడి. దీనికి కారణం ఉంది. అక్షయ్ కుమార్ హీరోగా కాంచన రీమేక్ గా రూపొందుతున్న లక్స్మీ బాంబ్ లో కియారానే హీరోయిన్. మొదటిసారి అక్కితో ఛాన్స్ రావడంతో ఆలోచించకుండా ఒప్పేసుకుంది. కథ పరంగా మరీ ఎక్కువ ప్రాధాన్యం లేకపోయినా ఒరిజినల్ వెర్షన్ తెగ నచ్చేసి ఒప్పుకుంది. దీని షూటింగ్ జరుగుతుండగానే కియారా టాలెంట్ ని చూసిన లారెన్స్ స్వయంగా వాసు గారికి రికమండ్ చేశాడట.
అయితే తను రజినికి జోడిగా నటిస్తుందా లేక లారెన్స్ పక్కనా అనేది మాత్రం అధికారిక ప్రకటన వచ్చాక తెలుస్తుంది. జ్యోతిక తరహా పాత్ర ఆఫర్ చేస్తే ఇక చెప్పేదేముంది. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. లాక్ డౌన్ అయ్యాక తలైవా ముందు అన్నాతే షూటింగ్ పూర్తి చేస్తారు. ఆ వెంటనే చంద్రముఖి 2 సెట్స్ పైకి వెళ్ళిపోతుంది. ఎక్కువ ఆలస్యం చేయకుండా కేవలం మూడు నెలల్లో మొత్తం పూర్తి చేసేలా ప్లానింగ్ తో ఉన్నారట. ఇది కాగానే ఖైదీ-మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇదీ అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు. ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ కావడంతో చంద్రముఖి 2 మీద మాములు అంచనాలు ఉండేలా కనపడటం లేదు. అందులోనూ క్రేజీ కాంబో సెట్ అవుతోంది కాబట్టి తెలుగులోనూ దీనికి విపరీతమైన ప్రచారం దక్కడం ఖాయం.