అందరూ ఊహించిన విధంగానే ప్రముఖ సినీనటి, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఖుష్బూ సోమవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.ఖుష్భూ బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఖుష్బూ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సోమవారం పంపించారు.
ఖుష్బూ తన రాజీనామా లేఖలో కాంగ్రెస్ పార్టీని వీడటానికి గల కారణాలను వివరించారు. ముఖ్యంగా కొందరు ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు పార్టీ కోసం పనిచేస్తున్న తనలాంటి వారిని అణచివేస్తున్నారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన అనంతరం తాను పార్టీలో చేరినట్లు ఖుష్బూ తెలిపారు. ప్రజలకోసం పని చేసేందుకు పార్టీలో చేరానే తప్ప తన పేరు ప్రతిష్టలు కోసం కాదని స్పష్టం చేశారు. కానీ పార్టీలో ఉన్న కొందరు ఉన్నత స్థాయి నేతలు తనను అణచివేసేందుకు ప్రయత్నం చేసారని పేర్కొన్నారు. అందుకే నిరసనగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఖుష్బూ వెల్లడించారు. పార్టీలో తనకు సహకారం అందించిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
రాజీనామా అనంతరం ఢిల్లీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ఖుష్బూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన అనంతరం జేపీ నడ్డాను కలిశారు. దేశం సరైన దిశలో ముందుకు సాగాలంటే నరేంద్ర మోడీ లాంటి బలమైన నాయకుడు కావాలని ఖుష్బూ పేర్కొన్నారు. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖుష్బూ బీజేపీలో చేరడం తమిళనాడు బీజేపీ శ్రేణులకు ఆనందం కలిగిస్తుంది. ఎన్నికల్లో ప్రభావం చూపడానికి ఖుష్బూ చేరిక ఉపయోగ పడుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.