iDreamPost
android-app
ios-app

కేర‌ళ టు హైద‌రాబాద్ : గోల్డ్ స్కాం లింకులు?

కేర‌ళ టు హైద‌రాబాద్ : గోల్డ్ స్కాం లింకులు?

కేర‌ళ రాజ‌కీయాల్లో తీవ్ర ప్ర‌కంప‌న‌లు సృష్టించిన గోల్డ్ స్కాం సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఆ స్కాంకు సంబంధించిన ద‌ర్యాప్తు ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈ కేసు నేప‌థ్యంలో కేర‌ళ‌ సీఎం కార్యాలయంలో కూడా క‌ల‌క‌లం రేగింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ స్కాంకు సంబంధించి ఇప్పుడు మ‌రో వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ కేసుకు హైదరాబాద్‌తో లింకులు ఉన్నట్లు క‌స్ట‌మ్స్ విభాగం గుర్తించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ కేసులో అత్యంత కీలకమైన నగదు చెల్లింపులు హైదరాబాద్‌ నుంచే జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు.

రూ. కోట్లాది విలువ చేసే బంగారం కొనేందుకు నిందితులు అడ్డదారుల్లో హవాలా మార్గాల్లో చెల్లిస్తారన్న విషయం తెలిసిందే. ఈ కేసులో రూ. కోట్లు హైదరాబాద్‌ నుంచి హవాలా రూపంలో దుబాయ్‌కి చెల్లింపులు చేశారన్న సమాచారంపై కస్టమ్స్‌ శాఖ కూడా కూపీ లాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులు స్వప్నా సురేశ్‌, సందీప్‌ నాయర్‌ను అరెస్ట్‌ చేసింది.

గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారం కేరళలో పెను ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఏకంగా సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను తొలగించారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంలో ఐటీ శాఖ ఉద్యోగి పాత్రపై ఆరోపణలు బయటపడిన వెంటనే శివకంర్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది.

ఈ నెల 6వ తేదీన దుబాయ్‌ నుంచి చార్టర్డ్‌ విమానంలో వచ్చిన కన్‌సైన్‌మెంట్‌ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. దౌత్య మార్గంలో తరలిన రూ. 15 కోట్ల విలువైన బంగారం విమానాశ్రయంలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. అతన్ని విచారించగా.. ఇందులో ఐటీ విభాగంలో పనిచేసే స్వప్న సురేశ్‌ హస్తం ఉన్నట్టు వెల్లడించాడు. దీంతో రాష్ట్ర ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పరిధిలోని స్పేస్‌ పార్క్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న స్వప్న బంగారం తరలింపులో కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా హైద‌రాబాద్ తో ఉన్న లింకులు ఏమిటో…? ‌దాంట్లో ఎవ‌రి పాత్రం ఉందో తెలుసుకునే ప‌నిలో అధికారులు నిమ‌గ్నం అయ్యారు.

ప్ర‌ధాని వ‌ర‌కూ…

కేర‌ళ గోల్డ్ స్కాం కేసు పంచాయ‌తీ చివర‌‌కు ప్ర‌ధాని వర‌కు కూడా చేరింది. దీనిపై ప్ర‌తిప‌క్షాలు రాద్దాంతం చేయ‌డం, ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బార‌డంతో సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. ఈ స్కామ్ లో రాజ‌కీయాల‌కు అతీతంగా ‌విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. ఈ కేసు చాలా తీవ్ర‌మైద‌ని, దేశాన్ని చిక్కుల్లో పారేసే ఆర్థిక నేరం కాబ‌ట్టి దీనిపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేపాట్టాల‌ని సీఎం మోదీకి రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. మ‌రోవైపు.. ఈ కేసు మొత్తం స్వ‌ప్న సురేశ్ చుట్టే తిరుగుతోంది. ఆమె సోష‌ల్ మీడియా ప్రొఫైల్‌లో ముఖ్య‌మంత్రి విజ‌య‌న్ తో పాటు.. ప్ర‌ముఖుల‌తో దిగిన ఫొటోలు ఉన్నాయి.