అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నా సరే ఒక సంఘటన యావత్ దేశాన్ని ఏకం చేసింది.. చేయి చేయి కలిపి ఆ సంఘటనను నిరసించారు. కొన్ని రోజులపాటు అమెరికా దేశం అతలాకుతలం అయింది. ఆఖరికి అమెరికా అధ్యక్షుడు బంకర్ లో దాక్కోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అత్యంత ప్రభావం చూపిన ఆ సంఘటనకు మూల కారణం నల్ల జాతీయుడైన జార్జి ఫ్లాయిడ్ పట్ల అమెరికా పోలీసులు వ్యవహరించిన తీరే ప్రధాన కారణం.. ఊపిరి ఆడకుండా జార్జ్ ఫ్లాయిడ్‌ను మోకాలితో తొక్కి పట్టడంతో ఫ్లాయిడ్ మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనతో అమెరికా అట్టుడికిపోయింది.
తాజాగా అలాంటి ఘటన కేరళలో జరగడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఒక వ్యక్తిని పోలీస్ అధికారి నేలపై అదిమిపెట్టి కూర్చున్న ఫొటోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పోలీస్ అధికారి వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
అసలేం జరిగింది..
కేరళలో సంచలనం సృష్టించిన బంగారం అక్రమ తరలింపు కేసులో మంత్రి జలీల్‌ను ఈడీ ప్రశ్నించింది. ఇదే సమయంలో ఆయన రాజీనామా చేయాలంటూ యువజన కాంగ్రెస్ సభ్యులు ఆదివారం సాయంత్రం ఆందోళనలు చేపట్టారు. మంత్రి జలీల్ మలప్పురం నుంచి తిరువనంతపురానికి వెళ్తుండగా అంగామలే వద్ద ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను నిరసనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు నిరసనకారులను అడ్డుకుని చెదరగొట్టే క్రమంలో ఆంటోనీ అనే వ్యక్తి కింద పడిపోయాడు.
అదే సమయంలో అటుగా పరిగెత్తుకొచ్చిన పోలీస్ అధికారి ఆంటోనీని మంత్రి జలీల్ కాన్వాయ్ వెళ్లిపోయే వరకూ నేలకు అదిమిపట్టి ఉంచాడు. పోలీస్ ఆంటోనిని నేలకు అదిమిపట్టి ఉంచడాన్ని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు గమనించి ఆయనను పోలీస్ నుండి విడిపించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ మరియు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ ఘటన అనుకోకుండా జరిగిందని ఒక పోలీస్ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.