iDreamPost
iDreamPost
ఆయన ఓ పోలీస్ బాస్.. తెలుగువారైన ఆయన కేరళలో ఐజీ క్యాడర్ లో పనిచేస్తున్నారు. ఒక దశలో ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి నాయకుడు అవ్వాలనుకున్నారు. చాలా తీవ్రంగా ప్రయత్నించారు. అవేవీ సఫలం కాలేదు. పోనీ ఉద్యోగం చేసుకుంటున్నారనుకుంటే.. చెడు సావాసాలు మొదలయ్యాయి. పురాతన వస్తువుల విక్రయం పేరుతో చీటింగ్ చేస్తున్న ఓ మోసగాడికి సహకరించారన్న ఆరోపణలతో సదరు ఐజీ తన ఉద్యోగానికి ఎసరు తెచ్చుకున్నారు. ఇప్పుడు సస్పెండ్ అయ్యి.. కేసుల్లో చిక్కుకున్న ఆ ఐపీఎస్ అధికారి పేరు గగులోతు లక్ష్మణ్ నాయక్. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు.
మోసగాడితో చెట్టపట్టాలు
కేరళలో ట్రాఫిక్ ఐజీగా ఉన్న లక్ష్మణ్ నాయక్ పురాతన వస్తువుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కన్మన్ మాన్షన్ మవంకల్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని అతని అక్రమాలకు సహకరించారన్న ఆరోపణలు కేరళ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో దాదాపు నిర్ధారణ అయ్యాయి. విపరీతమైన డిమాండ్ ఉండే పురాతన వస్తువుల విక్రయం పేరుతో మవంకల్ కేరళలో పలువురు ప్రముఖుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాగించాడన్న ఆరోపణలతో సెప్టెంబర్లో అరెస్టయ్యాడు. అతగాడికి ఐజీ లక్ష్మణ్ సహకరించారని దర్యాప్తులో తేలింది.
ఈ వ్యవహారంలో మవంకల్ కు సహాయకారిగా ఉండేందుకు ఏపీకి చెందిన ఒక మహిళను లక్ష్మణ్ అతనికి పరిచయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. లక్ష్మణ్ తో వారిద్దరూ జరిపిన వాట్సాప్ చాటింగులు పురాతన వస్తువుల వ్యవహారంలో వారి మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టాయి. గతంలో మాన్షన్ పై నమోదైన ఒక చీటింగ్ కేసును క్రైమ్ బ్రాంచ్ నుంచి తప్పించి.. స్థానిక పోలీస్ స్టేషనుకు బదలాయించడంతో పాటు దాని దర్యాప్తును నిందితుడికి సన్నిహితుడైన ఇన్స్పెక్టర్ కు అప్పగించేలా ఐజీ లక్ష్మణ్ తన పరపతి ఉపయోగించారని వెల్లడైంది.
ఆగస్టులో తిరువనంతపురం పోలీస్ క్లబ్బులో మాన్షన్ కు ఐజీయే బస ఏర్పాటు చేశారు. పురాతన గోల్డెన్ ఖురాన్, బైబిల్, గణేష్, చేప విగ్రహాల డీల్ సెటిల్ చేసుకునేందుకు నేరుగా పోలీస్ క్లబ్బునే వాడుకున్నారు. ఆ డీల్ పూర్తికాక ముందే సెప్టెంబర్లో మాన్షన్ అరెస్ట్ అయ్యాడు. పురాతన విగ్రహాలు తీసుకొచ్చేందుకు ఐజీ లక్ష్మణ్ తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిని కలూరులోని మవంకల్ ఇంటికి పంపేవారని.. స్వయంగా తాను కూడా సుమారు 16 సార్లు నిందితుడి ఇంటికి వెళ్లారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ వివరాలతో క్రైమ్ బ్రాంచి సమర్పించిన నివేదికను పరిశీలించిన కేరళ సీఎం పినరయి విజయన్.. ఐజీ లక్ష్మణ్ ను సస్పెండ్ చేసి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఏడీజీపీ ప్రమోషన్ ను కూడా నిలిపివేశారు.
ప్రజాప్రతినిధి అయ్యేందుకు విఫల యత్నం
ఐజీ లక్ష్మణ్ కుటుంబంలో పలువురు తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. రిటైర్డ్ ఏడీజీపీ డాక్టర్ డి.టి.నాయక్ కు ఆయన స్వయానా అల్లుడు. నాయక్ కుమార్తె డాక్టర్ కవితను లక్ష్మణ్ వివాహం చేసుకున్నారు. డి. టి.నాయక్ ప్రజారాజ్యంలో చేరి 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో మహబూబాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. కాగా 2014, 19 ఎన్నికల్లో కాంగ్రెసులో చేరి ఎంపీగా పోటీ చేయాలని లక్ష్మణ్ ప్రయత్నించారు. 2018 ఎన్నికల్లో కూడా మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కోసం కూడా ప్రయత్నించారు. కానీ ఆయనకు కాకుండా మాజీమంత్రి రెడ్యానాయక్ కుమార్తె మాలోత్ కవితకు ఇచ్చారు. సొంత సామాజిక వర్గమైన లంబాడా తెగకు రాజకీయంగా అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. లక్ష్మణ్ నాయక్ పలు కార్యక్రమాలు కూడా నిర్వహించి వెలుగులోకి రావాలని ప్రయత్నించారు. అయితే అవేవీ వర్కౌట్ కాలేదు. దాంతో తిరిగి కేరళకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు కేసుల్లో చిక్కుకొని ఉద్యోగం కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు.
Also Read :, MLC, Nadyala Isak – సాధారణ కార్యకర్త.. ఎమ్మెల్సీ ఎలా కాబోతున్నాడు..?