iDreamPost
iDreamPost
ఇప్పుడంటే లూసిఫర్, అయ్యప్పనుం కోషియం, కప్పేలా లాంటి రీమేక్ వార్తలు చూస్తూ మనవాళ్ళు మలయాళ సినిమాల మీద ఎక్కువ మనసు పడుతున్నారని అనుకుంటున్నాం కానీ ఈ ట్రెండ్ ఎప్పుడో దశాబ్దాల క్రితమే ఉంది. క్రమం తప్పకుండా అక్కడ ప్రూవ్ అయిన హిట్లను ఇక్కడి దర్శకులు హీరోలు తీస్తూనే వచ్చారు. కాకపోతే ఫలితాలు ప్రతిసారి ఒరిజినల్ వెర్షన్ రేంజ్ లో ఉండవు. ఓ మంచి ఉదాహరణ చూద్దాం. 1988లో మోహన్ లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘ఆర్యన్’ అనే సినిమా వచ్చింది. శోభన హీరోయిన్ గా రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో భారీగా నిర్మించారు. దీనికి మోహన్ లాల్ సహనిర్మాత కూడా.
అదే సంవత్సరం ఆగస్ట్ లో విడుదలైన ఆర్యన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఏకంగా 200 రోజులు ఆడేసి కొత్త రికార్డులు సృష్టించింది. దీన్ని తెలుగులో బాలకృష్ణ హీరోగా ఎస్ఎస్ రవిచంద్ర డైరెక్షన్ లో అంతకన్నా ఎక్కువ బడ్జెట్ తో ‘అశోక చక్రవర్తి’ టైటిల్ తో పునఃనిర్మించారు. భానుప్రియ హీరోయిన్ గా సత్యనారాయణ, రంగనాథ్, అంజలీదేవి, చలపతిరావు, సోమయాజులు, శుభలేఖసుధాకర్, పిఎల్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఆర్యన్ ఎక్కడైతే రియల్ లొకేషన్లో షూట్ చేశారో దీని చిత్రీకరణ కూడా అక్కడే జరిపారు. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించగా నందమూరి మోహనకృష్ణ ఛాయాగ్రహణం చేశారు. 1989లో జూన్ 29న విపరీతమైన అంచనాల మధ్య అశోక చక్రవర్తి విడుదలయ్యింది.
ఎక్కడో ఓ చిన్న ఊళ్ళో ఉండే సద్బ్రాహ్మణుడు చేయని తప్పుకు ఇల్లు వదిలి ముంబై వెళ్ళిపోయి అక్కడ కరుడు గట్టిన మాఫియా డాన్ గా ఎలా మారడనేదే ఇందులో మూలకథ. ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కథనం నడిపించినప్పటికీ తెలుగు నేటివిటీ తగ్గడంతో అశోక చక్రవర్తి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. క్లైమాక్స్ హడావిడిగా ముగించడం ఫ్యాన్స్ కు నచ్చలేదు. అందులోనూ ముద్దుల మావయ్య లాంటి ఫ్యామిలీ కమర్షియల్ డ్రామాలో బాలయ్యను చూసిన కళ్ళతో ఎందుకో అశోక్ గా రిసీవ్ చేసుకోలేకపోయారు. ఫలితంగా ఆర్యన్ రేంజ్ లో ఇది మెప్పించలేకపోయింది. తమిళంలో సత్యరాజ్ తో ‘ద్రవిడన్’ గా, కన్నడలో అంబరీష్ తో ‘చక్రవర్తి’గా రీమేక్ చేస్తే అక్కడా పెద్దగా ఆడలేదు. కానీ స్టైలిష్ డాన్ గా బాలయ్య అశోక చక్రవర్తిలో చాలా అందంగా కనిపించిన మాట వాస్తవం.