Idream media
Idream media
ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రాతినిధ్యాన్ని విస్తరించుకుంటూ పోతోంది. దేశ రాజధానిలో చక్రం తిప్పుతూ ఇతర రాష్ట్రాల్లో కూడా అడుగులు పెడుతోంది. గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లోనూ సత్తా చాటుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పంజాబ్ లో ఉనికి చాటుకున్నా అక్కడ పాగా వేసేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఆ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. దేశ అర్థిక రాజధాని వుండే ముంబై వుండే మహారాష్ట్రలో ఇప్పటికే ఉనికి చాటుకుంది. చాప కింద నీరులా మెల్లగా విస్తరిస్తోంది. అక్కడ జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 96 సీట్లు సాధించి సత్తా చాటింది. విజయం సాధించిన 96 స్థానాల్లో 41 స్థానాలను ఒక్క యవత్మాల్ జిల్లా నుంచే గెలుపొందడం విశేషం.
అలాగే గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 120 మంది సభ్యులున్న సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 27 సీట్లను గెలుచుకోవడం ద్వారా ఆప్ అక్కడ కూడా అడుగు పెట్టింది. అప్పటి నుంచీ ఆప్ ఆ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. 2022 లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లకూ తాము పోటీ చేస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇటీవలే కేజ్రీవాల్ అహమ్మదాబాద్ కూడా వెళ్లి వచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు చేశారు. ఇక్కడి ప్రజల అభీష్టాలకు అనుగుణంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. మహా రాష్ట్రపై దృష్టి సారించిన ఆప్ వచ్చే ఏడాది రానున్న బృహన్ ముంబై (గ్రేటర్ ముంబై) కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటోంది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చే ఏడాది జరగనున్నాయి. ఇటీవల గుజరాత్ పర్యటనకు వెళ్లిన కేజ్రీవాల్.. అహమ్మదాబాద్ లో తమ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ 27 సీట్లను గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడంతో ఇక గుజరాత్ లో కూడా తమ హవా చాటడానికి ఆయన సిద్ధపడుతున్నారు. గుజరాత్ అసెంబ్లీకి సైతం వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రేపు తాను అమృత్ సర్ ను విజిట్ చేస్తానని, అక్కడ ఆప్ పటిష్టతకు తీసుకోవలసిన చర్యలను సమీక్షిస్తానని కేజ్రీవాల్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ఐపీఎస్ అధికారి కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ ను తమ పార్టీలో చేర్చుకోవచ్చు. 2015 లో కోటక్ పురాలో జరిగిన పోలీసు కాల్పులపై దర్యాప్తునకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందంలో ఆయన ఒకరు. అయితే ఆ తరువాత ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడంతో ఈ ఉదంతం తాలూకు రిపోర్టును పంజాబ్ హర్యానా హైకోర్టు కొట్టివేసింది.
మూడు నెలల్లో కేజ్రీవాల్ పంజాబ్ ను సందర్శించడం ఇది రెండో సారి. గత మార్చి నెలలో విజిట్ చేసినప్పుడు సీఎం అమరేందర్ సింగ్ ప్రభుత్వంపై ఆయన విరుచుకపడ్డారు. ప్రజలను ఈ ప్రభుత్వం ఛీట్ చేస్తోందని ఆరోపించారు. మీకు స్మార్ట్ ఫోన్ లు ఇస్తామని, మీ రుణాలను మాఫీ చేస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ అలా జరిగిందా అని ఆయన మోగాలో జరిగిన కిసాన్ మహా సమ్మేళన్ లో రైతులనుద్దేశించి ప్రశ్నించారు. 2017 లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ 117 సీట్లకు గాను 20 స్థానాలను దక్కించుకుంది. ఇలా ఆప్ తన సామ్రాజాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై కేజ్రీవాల్ ముందుగా దృష్టి సారించారు. నెలకో రాష్ట్రాన్ని విజిట్ చేస్తూ స్థానికంగా పార్టీ బలోపేతానికి కావాల్సిన చర్యలు చేపడుతున్నారు.