iDreamPost
iDreamPost
మొదటి సినిమా నేను శైలజతోనే మంచి పేరు తెచ్చుకుని క్లిక్ అయినప్పటికీ కీర్తి సురేష్ ని తెలుగు ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గర చేసిన సినిమా మహానటి. జాతీయ అవార్డు దక్కించుకున్నా అంతకు మించి లెక్కలేనన్ని ఆదరాభిమానాలు, ప్రశంశలు దక్కాయి. కానీ ఆ తర్వాత అలాంటి పాత్రలే చేయాలని గిరి గీసుకోకుండా రెగ్యులర్ హీరోయిన్ వేషాలు కూడా చేసింది. సీమ రాజా, స్వామి స్క్వేర్, పందెం కోడి 2, సర్కార్ ఇవేవి తనకు పేరు తీసుకొచ్చినవి కాదు. అన్నీ హీరోలు హైలైట్ అయిన సబ్జెక్టులే. ఇదేదో అంతగా వర్క్ అవుట్ కావడం లేదని ఫిమేల్ ఓరియెంటెడ్ వైపు మళ్ళీ మొగ్గు చూపింది. తన పాత్రే సెంట్రిల్ పాయింట్ గా నిలిచే కథలనే ఒప్పుకుంది.
ఈ సిరీస్ లో మొదటగా వచ్చిన పెంగ్విన్ రెగ్యులర్ సైకో థ్రిల్లర్ గా ఎవరినీ మెప్పించలేకపోయింది. తనవరకు పెర్ఫార్మన్స్ పరంగా బాగానే చేసినప్పటికీ కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం నిరాశకలిగించింది. నిన్న మిస్ ఇండియా వచ్చింది. మంచి క్యాస్టింగ్, అమెరికాలో చిత్రీకరణ, భారీ బడ్జెట్ ఇవేవి పసలేని కథాకథనాల ముందు నిలవలేకపోయాయి. ఫలితంగా యునానిమస్ గా నెగటివ్ టాక్ వచ్చేసింది. తను హైలైట్ అయితే చాలు స్టోరీలో మ్యాటర్ లేకపోయినా పర్లేదు అనే తరహాలో సాగింది మిస్ ఇండియా. అసలు ఇవి ఓకే చేసింది మహానటేనా అని అనుమానం వచ్చేలా ఫలితం దక్కింది.
ఇప్పుడిదంతా రాబోయే గుడ్ లక్ సఖి మీద అంచనాలను తగ్గించే ప్రమాదం ఉంది. ట్రైలర్ల వరకు అన్నీ ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నప్పటికీ సినిమాలే తేడా కొడుతున్నాయి. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన గుడ్ లక్ సఖి మీద పాజిటివ్ బజ్ ఉంది కానీ ఇది కూడా నిలబెట్టుకోలేకపోతే ఇకపై కీర్తి సురేష్ సోలో మూవీస్ కి గండం ఏర్పడ్డట్టే. తాను ఒకటే ఉంటే సరిపోదని ఇకనైనా గుర్తించాలి. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన ఆఫర్లు వస్తున్నప్పుడు సబ్జెక్టు సెలక్షన్ లో జాగ్రత్తగా ఉండాలి. నితిన్ తో చేసిన రంగ్ దే, రజినీకాంత్ అన్నాతే, మోహన్ లాల్ మరక్కార్ ల మీదే ఇప్పుడు తన ఆశలన్నీ. చిరంజీవి వేదాలం రీమేక్ లో సిస్టర్ పాత్ర చేయోచ్చనే టాక్ వచ్చింది కానీ ఇంకా నిర్ధారణ కాలేదు.