Idream media
Idream media
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనులను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా దాన్ని తీర్చిదిద్దుతోంది. సంబంధిత పనులు తుదిదశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పరిశీలించారు.
ఉదయం 12.07 గంటలకు హెలికాప్టర్ ద్వారా కేసీఆర్ యాదాద్రి పెద్దగుట్టకు చేరుకున్నారు. కొండపై బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయం ప్రకారం మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. లక్ష్మీనృసింహులకు స్వర్ణ పుష్పార్చన, ప్రత్యేక పూజల అనంతరం మహదాశీర్వచనం జరిపారు. స్వామివారి శేషవస్ర్తాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆరేళ్లుగా సాగుతున్న ఆధ్యాత్మిక యజ్ఞం పూర్తి కావస్తుండటంతో స్వామివారి గర్భాలయ దర్శనాలకు మే(వైశాఖ)నెలలో ఆలయ ఉద్ఘాటన ముహూర్తానికి నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా ప్రకటించారు.
దాదాపు ఆరు గంటలపాటు ఆలయంలోనే ఉండి నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధాన ఆలయ మాఢవీధుల్లో ఇండోర్‌లో తయారు చేసిన క్యూ కాంప్లెక్స్ స్వర్ణవర్ణపు లోహపు కంపార్ట్‌మెంట్‌ను, అనంతరం ప్రాకార మండపాలకు చేరుకుని దక్షిణ దిశగా కొండపై ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్‌ను పరిశీలించారు. వీటికి ఏర్పాటు చేసిన దిమ్మెలకు సాధారణ రూపం కాకుండా ఆర్నమెంటేషన్ చేయాలని ఆదేశించారు. ఆలయం చుట్టూ ప్రహరీని ప్రాచీన చిత్ర కళాకృత రూపాలతో బ్రాస్, మెటల్‌తో సుందరంగా మరింత శోభాయమానంగా తీర్దిదిద్దాలన్నారు. దేవాలయం ముందుభాగంలో కనుచూపు మేర అద్భుతంగా తీర్చిదిద్దాలని, భక్తులకు వైకుంఠంలో సంచరిస్తున్న తలంపు కలగాలని అన్నారు. అనంతరం అష్టభుజి ప్రాకార మండపం నుంచి తూర్పు దిశగా దర్శన క్యూలైన్ల గుండా ప్రధానాలయంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి.. మార్గమధ్యంలోని యాలీ పిల్లర్లు, సాలహారపు దేవతామూర్తులను, అంతర్ ప్రాకార మండపంలోని అద్దాల మండపంతోపాటు రామానుజ కూటం మండపాలను పరిశీలించారు.
తిరుమల మాదిరి సేవలు
యాదాద్రి ఆలయంలో తిరుమలలో మాదిరి స్వామివారికి సేవలందించే విధంగా అర్చకులు కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించే అర్చకులు, సిబ్బందికి ఆలయ సమీపంలోనే అన్ని వసతులతో నివాస సముదాయం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానాలయం ముఖమండపం, అక్కడ ఉప ఆలయాలు పరిశీలించిన ముఖ్యమంత్రి.. ఆలయ అర్చక బృందంతో ఆగమ, వైదిక నియమాలపై చర్చించారు.
ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో మాదిరి విశ్రాంత అర్చకులు, పేద బ్రాహ్మణలు తమ భుక్తిని వెళ్లదీసుకునే విధంగా భక్తుల నుంచి కానుకలు స్వీకరించి జీవన భృతి కొనసాగించేలా యాదాద్రి కొండపై ప్రత్యేక మండపం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఉద్ఘాటన తర్వాత నిత్యం 50 వేలకు తగ్గకుండా భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని అన్నారు. స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో ఇతర దేవాలయాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. అందుకు అవసరమైన ఉద్యోగులను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ఉద్యోగులతో పాటు ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులైన శిల్పులకు కూడా ఇండ్ల స్థలాల కేటాయింపును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
నిర్వాసితులతో సమావేశం
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిలో భాగంగా రహదారి విస్తరణలో నష్టపోతున్న నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత కోరిక మేరకు నిర్వాసితులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పాతగుట్ట చౌరస్తా- వైకుంఠ ద్వారం వద్ద గల ప్రధాన రహదారి విస్తరణ నిర్వాసితుల సంఘం కన్వీనర్ డాక్టర్ ముడుంబై గిరిధర్ ఆధ్వర్యంలో దాదాపు గంటపాటు పరిహారం, పునరావాస చర్యలపై చర్చించారు. గతంలో తమకు ఇచ్చిన హామీ మేరకు మడిగెకు మడిగె, ఇంటికి ఇల్లు ఇవ్వాలని నిర్వాసితులు సీఎంను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం.. ఆలయ నగరిగా అభివృద్ధి చెందుతున్న గండి చెరువు, కల్యాణకట్ట ప్రాంతంలో ప్రత్యేకంగా 100 గజాల్లో మడిగె నిర్మించి తాళాలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. సైదాపురం శివారులో 200 గజాల ఇంటి స్థలం పట్టాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. రహదారి విస్తరణకు సహకరించాలని సీఎం కేసీఆర్ కోరగా నిర్వాసితులు తమ అంగీకారం తెలిపారు.