Idream media
Idream media
మనం ఏ స్థాయిలో ఉన్న.. ఈ స్థాయి వచ్చేందుకు కారణమైన వారిని మరువకూడదంటారు. ప్రస్తుత మన హోదాకు కారణమైన వారికి రుణపడి ఉంటాం. వారిపై కృతజ్ఞత చాటుకుంటాం. ఇప్పుడు అదే పని చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి ‘అన్న’పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా.. రాజకీయ భవిష్యత్ కల్పించింది మాత్రం ఎన్టీఆర్‌నే. అందుకే ఆయన పట్ల కేసీఆర్ కృతజ్ఞత చాటుకుంటున్నారు.
ఎన్టీఆర్‌ను పార్టీలకు అతీతంగా అందరూ అభిమానిస్తారు. కే సీఆర్ తీసుకున్న నిర్ణయం యావత్ తెలుగు ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది. ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఉన్నారు. కేసీఆర్ నిర్ణయం తనకు సంతోషాన్ని ఇచ్చిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంపై కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించేందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్‌లు ప్రయత్నం చేయాలని కూడా సోమిరెడ్డి లేఖ రాశారు. బహుసా.. ఎన్టీఆర్ అంటే సోమిరెడ్డి కూడా అభిమానమే కావచ్చు. ఆ అభిమానమే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించాలని ఆయన చేత లేఖ రాయించి ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలపడం కూడా అదే కోవలోనిదే కావచ్చు.
తనకు రాజకీయంగా అవకాశాలు కల్పించిన ఎన్టీఆర్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ కృతజ్ఞత చాటుకున్నారు. మరి కూతురును ఇచ్చి అల్లుడును చేసుకుని, పార్టీ, ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిన(లాక్కున్నారని అంటున్నారు) మామకు చంద్రబాబు చేసింది ఏమిటి..? అనే ప్రశ్న బహుసా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలో ఇప్పటికే వచ్చి ఉంటుంది. కేసీఆర్ మాదరిగా చంద్రబాబు కూడా కృతజ్ఞత చాటుకునేందుకు అవకాశం లేదా..? అంటే.. మూడు సార్లు ముఖ్యమంత్రి పదవిలో బాబు ఉన్నారాయే.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, అధికారంలో ఉన్న సమయంలోనూ.. మహానాడుల్లో ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేయడమేగానీ.. అంతకు మించి బాబు చేసింది ఏమీ లేదని సోమిరెడ్డికి కూడా తెలుసు. అందుకే జగన్, కేసీఆర్‌లు ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించాలని లేఖ రాశారు. రాష్ట్రపతులను, ప్రధానులను ఎంపిక చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబుకు.. తన మామకు భారత రత్న ఇప్పించలేకపోయాడా..? అనేది సగటు వ్యక్తిలో మెదిలే సందేహం. కేసీఆర్‌ను చూసైనా బాబు కూడా తన మామ పట్ల ఏదో ఒక విధంగా కృతజ్ఞత చాటుకుంటారా..? లేదా..? సోమిరెడ్డి లాంటి వారు బాబును అడిగితేగానీ ఈ ప్రశ్నకు సమాధానం లభించదు.