Idream media
Idream media
సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసి పట్టి.. కరవు నేలను తరలించేందుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారు చేయాలని సీఎం జగన్ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం అయన ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి ఆదేశం
సమావేశంలో పోలవరం నుంచి గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించే రెండు ప్రతిపాదనలపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. సముద్రంలో కలుస్తున్న ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. ప్రస్తుతం సాగునీటి వసతి ఉన్న ప్రాంతాలను స్థిరీకరించడమే కాకుండా, నిత్యం కరువుతో, తాగునీటి కొరతతో అల్లాడుతున్న ప్రాంతాలకు జలాలను తరలించి కష్టాలను తీర్చాలన్నదే తన ప్రయత్నమన్నారు. ఈ రెండు ప్రతిపాదనలపై అధ్యయనం చేసి.. డీపీఆర్ తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదనలపై వ్యాప్కోస్ అధ్యయనం చేసి.. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా పనులు చేపట్టనున్నారు.
105 రోజులు.. 210 టీఎంసీలు..
గోదావరి నది నుంచి సముద్రంలో కలిసిపోతున్న వరద జలాల్లో రోజుకు 23 వేల క్యూసెక్కుల చొప్పున అంటే 2 టీఎంసీల నీటిని.. 105 రోజులపాటు తరలించి.. మొత్తంగా 210 టీఎంసీలను ఒడిసి పట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. తద్వారా నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టులోని 9.61 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని, నాగార్జునసాగర్ రెండో దశలో భాగంగా ప్రకాశం జిల్లాలోని దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో మరో 2 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాలని భావిస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను ఈ ప్రాజెక్టు ద్వారా తీర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.