కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మె గౌడ ఆత్మహత్యకు పాల్పడటం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది. సోమవారం సాయంత్రం ధర్మేగౌడ ఇంటి నుంచి ఒంటరిగా కారులో బయటికి వెళ్లారు. కాగా రాత్రి అయినప్పటికీ తిరిగి రాకపోవడం,ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆయన ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు చిక్‌మంగ్‌ళూర్ జిల్లా కదుర్ తాలుకా గుణసాగర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై మంగళవారం వేకువజామున 2గంటల సమయంలో ధర్మె గౌడ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఆయన రైలు కింద పడి మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో ఒక సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆత్మహత్యకు మనస్తాపమే కారణమా?
కాగా ఈనెల 15న కర్ణాటక శాసనమండలిలో రభస జరిగిన విషయం తెలిసిందే. ఛైర్మన్ కే ప్రతాపచంద్ర శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభ్యులు వాగ్వాదాలకు దిగడమే కాకుండా ఒకరికొకరు తోసుకున్నారు. అక్కడితో ఆగకుండా సభాపతి స్థానంలో ఉన్న ధర్మె గౌడను కాంగ్రెస్ సభ్యులు ఛైర్మన్ సీటు నుంచి లాక్కెడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారని తెలుస్తుంది. ధర్మేగౌడ ఆత్మహత్యకు ఇతర వ్యక్తిగతమైన కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ మృతిపై మాజీ ప్రధాని దేవెగౌడ, జేడీఎస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం కర్ణాటక రాజకీయాలకు తీరని లోటని వ్యాఖ్యానించారు. కాగా ధర్మేగౌడ మరణం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుందని రాజకీయ నిపుణులు వెల్లడిస్తున్నారు.