భారతదేశంలో డ్రగ్స్ భూతం జడలు విప్పుతోంది. డ్రగ్స్ వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. డ్రగ్స్ వాడకానికి సంబంధించిన వార్తలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ డ్రగ్స్ మన జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకసారి వీటికి అలవాటు పడ్డ వ్యక్తి వీటి నుంచి దూరంగా ఉండలేక మానసికంగా కుంగి పోవడమే కాక చివరికి మరణం అంచుల దాకా వెళుతున్నారు. డ్రగ్స్ వాడకం వలన వాడే వారి ఆలోచన పూర్తిగా నశించే స్థాయికి చేరుకుంటుందని ఇటీవల కొన్ని సర్వేలు వెల్లడించిన అధ్యయనాల్లో స్పష్టమైంది. డ్రగ్స్ తీసుకోవడం కారణంగా మానసిక సమస్యలు ఏర్పడి మన దేశంలో ప్రతి 60 నిమిషాలకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నార్కోటిక్స్ బ్యూరో క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అయితే కంచే చేను మేసిన చందాన అరికట్టాల్సిన పోలీసులే ఆ డ్రగ్స్ మీద వచ్చే చిల్లర కోసం చిల్లర పనులు చేస్తూ దొరికిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. తాజాగా బెంగళూరులో డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై భద్రతా సిబ్బందిని నార్కోటిక్స్ అధికారులు అరెస్ట్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న ఆరోపణలతో సీఎం నివాసంలో పని చేస్తున్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కోరమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివకుమార్,సంతోష్ అని అధికారులు గుర్తించారు. వీరిద్దరూ ఆర్‌టీ నగర్లోని సీఎం బొమ్మై నివాసం వద్ద భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే తాము సీఎం ఇంట్లో పని చేస్తున్నాం కాబట్టి తమ మీద ఎవరికీ అనుమానం రాదనుకున్నారో ఏమో కానీ డ్రగ్స్ కొని అమ్మడం మొదలు పెట్టారు.
వారు డ్రగ్స్ వ్యాపారుల నుంచి డ్రగ్స్ తీసుకొని కస్టమర్లకు అమ్మి డబ్బు చేసుకుంటున్నట్టు గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సీఎం నివాసం సమీపంలో డన్జో(తక్కువ మొత్తంలో ద్విచక్ర వాహనాల మీద సరుకు రావాణా చేసే సరికొత్త యాప్) ద్వారా డ్రగ్స్ సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ రిసీవ్ చేసుకుంటున్న సమయంలో డబ్బు విషయమై డ్రగ్స్ వ్యాపారులతో వాగ్వాదం జరిగిందని ఆ సమయంలో అనుమానం వచ్చి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే గొడవ మొదలయ్యే సమయానికి గంజాయి పార్శిల్ వారి చేతికి అందింది.
అయితే ఈ డ్రగ్స్ రిసీవ్ చేసుకుంటున్న సమయంలో కానిస్టేబుళ్లు సివిల్ డ్రెస్ లోనే ఉన్నారు. తాము కర్ణాటకలోని మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ వ్యాపారులు అమ్జద్ ఖాన్, అఖిల్ రాజ్ నుంచి వాటిని కొనుగోలు చేసినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. ముందు పెద్ద ఎత్తున డ్రగ్స్ విక్రయిస్తున్న అఖిల్ రాజ్, అమ్జాద్ ఖాన్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి అరెస్ట్ గోప్యంగా ఉంచి వారి నుంచి సరుకు కొంటున్న వారి వివరాలు రాబడితే వారిలో పోలీసులు ఉండడంతో కంగుతిన్నారు. వెంటనే ప్లాన్ చేసి పోలీసులు, నార్కోటిక్స్ అధికారులు వారిని అరెస్టు చేశారు.