iDreamPost
android-app
ios-app

జగన్ బాటలో- కర్ణాటకలోనూ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు!

  • Published Jul 30, 2021 | 2:37 PM Updated Updated Jul 30, 2021 | 2:37 PM
జగన్ బాటలో- కర్ణాటకలోనూ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు!

ఆధునిక రాజకీయాలు సంప్రదాయ బాట నుంచి సోషల్ ఇంజినీరింగ్ వైపు మరలుతున్నాయి. గతంలో కొన్ని వర్గాలకే రాజకీయాల్లో ప్రాధాన్యం లభించేది. పలుకుబడి ఉన్నవారే పదవులు పొందేవారు.. అధికార హోదాలు అనుభవించేవారు. ఫలితంగా సామాజిక సమతుల్యత లోపించేది. గుర్తింపునకు నోచుకోని వర్గాల్లో అసహనం పెరిగిపోయేది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ అసమానతలను గుర్తించిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యం, గుర్తింపు ఇస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోషల్ ఇంజినీరింగుతో సమాజాన్ని సంస్కరించే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అటువంటి చర్యలకు సిద్ధం అవుతోంది.

బొమ్మై మదిలో జగన్ ఆలోచనలు

యడ్యూరప్ప వారసుడిగా కర్ణాటక సీఎం పదవి చేపట్టిన బసవరాజ్ బొమ్మై తన మంత్రివర్గ కూర్పుపై పార్టీ పెద్దల సూచనలతో కసరత్తు చేస్తున్నారు. మరో రెండేళ్లలో అంటే 2023లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉన్నందున.. అందుకు తగినట్లుగా మంత్రివర్గ నిర్మాణం ఉండాలని ఇటు బొమ్మై.. అటు పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దక్షిణాదిలో కర్ణాటకలోనే బీజేపీ ప్రభుత్వం ఉంది.

అయితే 2008 నుంచి కూడా అసెంబ్లీలో మెజారిటీ మార్క్ అయిన 113ను దాటడానికి బీజేపీ ఆపసోపాలు పడుతూనే ఉంది. ఈసారి అలాకాకుండా అన్ని వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా సంపూర్ణ మెజారిటీ సాధించాలని భావిస్తోంది. దానికోసం మంత్రివర్గం నుంచే సోషల్ ఇంజినీరింగ్ మొదలుపెట్టాలని నిర్ణయించింది.

దీనికి స్ఫూర్తి అంధ్రప్రదేశ్ లోని వై ఎస్ జగన్ ప్రభుత్వమే. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ ఐదు ప్రధాన సామాజిక వర్గాలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన తొలి సీఎంగా చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అదే ఫార్ములాను కర్ణాటకలో అమలు చేయాలని బొమ్మై భావిస్తున్నారు. వాస్తవానికి బొమ్మైకి తోడుగా ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలని తొలుత బీజేపీ నేతలు అనుకున్నారు. అయితే అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం, గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచనతో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో బలంగా ఉన్న లింగాయత్, వొక్కలిగ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. లింగాయత్ వర్గానికి చెందిన యడ్యూరప్ప స్థానంలో అదే వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మై సీఎం కావడంతో ఆ వర్గం సంతృప్తి చెందింది. మిగిలిన ఐదు వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులతో గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నారు.

ఏపీలో అన్నింటా సామాజిక న్యాయం

ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఏపీ సీఎం ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాల్లోనూ.. రాజకీయ పదవుల్లోనూ అన్ని సామాజిక వర్గాలకు సమ న్యాయం జరిగేలా చూస్తున్నారు. తన మంత్రివర్గంలో ఐదు ప్రధాన సామాజికవర్గాల ప్రతినిధులను ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చిన ఆయన.. మిగిలిన మంత్రి పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, యువ నేతలకే ఎక్కువ అవకాశాలిచ్చారు.

నాలుగు నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ, ఇటీవల జరిపిన నామినేటెడ్ పదవుల నియామకాల్లోనూ ఇదే సూత్రం పాటించారు. ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక సంక్షేమ కార్యక్రమాల్లోనూ అదే పంథా అవలంభిస్తున్నారు. బీసీ జాబితాలో ఉన్న 56 కులాలకు వేర్వేరుగా సంక్షేమ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. పథకాల అమలులో అన్ని సామాజిక వర్గాలు లబ్ది పొందేలా చూస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తుండటంతో పాటు దేశంలోని మిగతా రాష్ట్రాలను ఆకట్టుకుంటున్నాయి. అదే క్రమంలో కర్ణాటకలో బీజేపీ కూడా జగన్ పంథాలో 2023 ఎన్నికలు సిద్ధం కావాలని నిర్ణయించుకోవడం విశేషం.