కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. ఓటర్లు సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే పోలింగ్ బూత్ లకు క్యూకట్టి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 66 శాతం మంది ఓటర్లు ఈ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలోని 17మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. రెండు నియోజకవర్గాల్లో కేసులు విచారణలో ఉండడంతో వాటిని పెండింగ్ లో ఉంచారు. రాజీనామా చేసిన అభ్యర్థులందర్నీ అనర్హులని ప్రకటించిన సుప్రీంకోర్టు ఉపఎన్నికలో పోటీ చేసేందుకు అవకాశమిచ్చింది. అలా అనర్హత వేటు పడినవారిలో 16మంది బీజేపీలో చేరారు. వారిలో ఇప్పుడు 13మంది ఎన్నికలకు వెళ్లారు. కాంగ్రెస్, బీజేపీ 15స్థానాల్లో పోటీ చేయగా జేడీఎస్ 12, బీఎస్పీ 2, ఎన్సీపీ ఒక్కోస్థానంలో పోటీ చేసాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్, జేడీఎస్ లు వేర్వేరుగా పోటీ చేయడం వల్ల రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ప్రస్తుతం అతానీ, విజయనగర, కాగ్వాద్, గోకక్, ఎల్లాపూర, హిరికెరూర్, హున్సూర్, మహాలక్ష్మీ లేఅవుట్, రాణిబెన్నూర్, చిక్ బళ్లాపుర, హోస్కేటే, కేఆర్ పేట, కేఆర్ పురం, శివాజీనగర్, యశ్వంత్ పూర్ స్థానాలకు ఉపఎన్నిక జరుగింది. అయితే ఈ ఫలితాలు బీజేపీ ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారాయి. ఈ ఎన్నికలు మంత్రివర్గ విస్తరణ ఆధారంగా జరుగుతున్నాయని, ఫలితాలు వెలువడ్డాక రాష్ట్ర మంత్రివర్గం విస్తరిస్తామని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. కాంగ్రెస్, జేడీఎస్ లో అనర్హులైన ఎమ్మెల్యేలు బీజేపీ టికెట్ పై గెలిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటానని ముఖ్యమంత్రి యాడ్యూరప్ప ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు.
కర్ణాటక మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో పాటు మరో 34 మంది మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతం 18మంది మాత్రమే ఉన్నారు. అయితే ఇవాళ వెలువడనున్న 15అసెంబ్లీ స్థానాల ఫలితాల్లో కనీసం 6సీట్లు గెలిస్తేనే బీజేపీకి శాసనసభలో మెజారిటీ వచ్చి యాడ్యూరప్ప ప్రభుత్వం కొనసాగుతుంది. ఫలితాల్లో తేడా వస్తే యాడ్యూరప్ప క్యాబినేట్ కుప్పకూలిపోతుంది. ప్రస్తుతం బీజేపీకి 106మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ ఫలితాల్లో మేజిక్ ఫిగర్ 112కు పెరుగుతుంది. అయితే ఈ ఉపఎన్నికల ఫలితాలపై కొన్ని సంస్థలు ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించాయి. బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ సంస్థలు అంచన వేసాయి. ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా జేడీఎస్, కాంగ్రెస్‌లకు ఓటమి తప్పేటట్టు లేదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. 15 స్థానాలకు గానూ బీజేపీకి 8-10, కాంగ్రెస్ కు 3-5, జేడీఎస్ 1 లేదా 2, గెలిచే అవకాశం ఉందని కన్నడ పబ్లిక్ టీవీ తెలిపింది. బీటీవీ ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి 9, కాంగ్రెస్, జేడీఎస్ చెరో 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. పవర్ టీవీ కూడా బీజేపీకి 8-12, కాంగ్రెస్‌కు 3-6 స్థానాలు జీడీఎస్ 1 సీటు గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. మొత్తమ్మీద మరికొద్ది గంటల్లో ఫలితాలు తేలిపోనున్నాయి.