iDreamPost
iDreamPost
అధికార మార్పిడి తర్వాత కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న కర్ణాటక బీజేపీలో ఉప ఎన్నికల ఫలితాలు మళ్లీ కాక రేపుతున్నాయి.రాష్ట్రంలో హంగల్, సిండగి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా అధికార బీజేపీ సిండగిలో నెగ్గినా హంగల్ సీటును కోల్పోవడంతో ఆ పార్టీలో అంతర్మధనం మొదలైంది. ఓటమిపై అధిష్టానం సీరియస్ అవుతుండగా.. ఇదే అదనుగా మాజీ సీఎం యడ్యూరప్ప మరోసారి తన రాష్ట్ర పర్యటన నిర్ణయాన్ని తెరపైకి తెచ్చారు. కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పగ్గాలు చేపట్టిన వంద రోజుల్లోనే చేదు అనుభవం ఎదురు కావడం.. అదీ ఆయన సొంత జిల్లా హవేరిలోనే కావడంతో బొమ్మై నాయకత్వంపై పార్టీలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అధిష్టానం సీరియస్.. 8న సమీక్ష
హంగల్‌లో పార్టీ ఓటమిని బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అరుణ్ సింగ్, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్‌లకు ఇప్పటికే అధిష్టానం పెద్దలు క్లాస్ పీకినట్లు సమాచారం. మరో 18 నెలల్లో.. అంటే 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. సీఎం సొంత జిల్లా పరిధిలోని నియోజకవర్గంలో ఓటమిపాలు కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఓటమికి దారితీసిన కారణాలపై వెంటనే చర్చించి నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర ఇంఛార్జి అరుణ్ సింగ్‌ను అధిష్టానం ఆదేశించింది. ఆ మేరకు ఈ నెల 8న బెంగళూరులో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులకు ఇప్పటికే సందేశాలు వెళ్లాయి. మాజీ సీఎం యడ్యూరప్పకు కూడా ఆహ్వానం వెళ్లింది.
దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో ఆక్కడ అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న పార్టీ పెద్దలు హంగల్ ఓటమి నేపథ్యంలో అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్ నేతలను కాదని జనతాదళ్ నుంచి వచ్చిన బొమ్మైకి సీఎం పదవి ఇచ్చి తప్పు చేశామా అని వారు మధన పడుతున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్‌ను తప్పించే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
యడ్డీ విషయంలో పునరాలోచన
కాగా ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మాజీ సీఎం యడ్యూరప్ప మళ్లీ తెరపైకి వచ్చారు. గతంలో పెండింగ్‌లో పడిన రాష్ట్ర పర్యటనను 15 రోజుల్లో ప్రారంభిస్తానని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి నాయకులు, కార్యకర్తలను కలుస్తానని, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తానని చెప్పారు.హంగల్‌లో ఓటమికి సీఎం బొమ్మైని బాధ్యుడిని చేయలేమని వ్యాఖ్యానించారు. పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఓడిపోవడంపై చర్చ జరగాలని అన్నారు.
మరోవైపు బీజేపీ అధిష్టానం యడ్డీ విషయంలో పునరాలోచనలో పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన సహకారం లేనిదే వచ్చే ఎన్నికల్లో పార్టీ సంపూర్ణ విజయం సాధించడం కష్టమని గుర్తించింది. అందువల్ల యడ్డీ కోరినట్లు ఆయన తనయుడు విజయేంద్రకు రాష్ట్ర కేబినెట్‌లో చోటు కల్పించడం ద్వారా ఆయనను సంతృప్తి పరిచి పార్టీకి వినియోగించుకోవాలని అధిష్టానం భావిస్తోంది.