iDreamPost
android-app
ios-app

భర్త రావణుడి వేషంలో – భార్య సీత పాత్రలో

  • Published Jun 08, 2021 | 9:46 AM Updated Updated Jun 08, 2021 | 9:46 AM
భర్త రావణుడి వేషంలో –  భార్య సీత పాత్రలో

ఇప్పుడంతా రామాయణం సీజన్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా టీవీ సినిమా మాధ్యమాల్లో ఈ గాధ ఎన్ని సార్లు వచ్చిందో లెక్క బెట్టడం కష్టం. రామానంద సాగర్ దూరదర్శన్ సీరియల్ తో మొదలుపెట్టి యానిమేషన్ సిరీస్ ల దాకా వస్తూనే ఉన్నాయి. ఆఖరికి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో సైతం ఆది పురుష్ అంటూ ఆ కథను చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అక్షయ్ కుమార్ రామసేతు అంటూ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కూడా రామ సిద్ధాంతం చుట్టే తిరుగుతుంది. మొన్నటిదాకా అల్లు అరవింద్ వందల కోట్ల బడ్జెట్ తో రామాయణం తీయాలనుకుని ఆ తర్వాత ఇతరత్రా కారణాలతో విరమించుకోవడం చూసాం.

ఇక విషయానికి వస్తే ఆది పురుష్ లో సీత కృతి సనన్ నటిస్తున్న విషయం అందరికీ ఎరుకే. తను అంత బరువైన పాత్రకు ఎంత మేరకు న్యాయం చేయగలుగుతుందనేది పక్కనపెడితే దాని కోసం కష్టపడి మరీ మేకోవర్ చేసుకుంటోంది. మరోవైపు బాహుబలి ఆర్ఆర్ఆర్ కథకులు విజయేంద్ర ప్రసాద్ రామాయణ సీతను ఆధారంగా చేసుకుని ఒక పవర్ ఫుల్ సబ్జెక్టుని సిద్ధం చేస్తున్నారు. ఇందులో టైటిల్ పాత్ర చేయించడం కోసం కరీనా కపూర్ ని ప్రయత్నిస్తున్నట్టుగా బాలీవుడ్ టాక్. పన్నెండు కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని అక్కడే బేరసారాలు జరుగుతున్నాయని అక్కడి రిపోర్ట్స్ ని బట్టి అర్థమవుతోంది.

గత కొంతకాలంగా కరీనా కపూర్ పిల్లల కోసం ఎక్కువ సినిమాలు చేయడం లేదు. అయితే సీత లాంటి ఛాలెంజిగ్ క్యారెక్టర్ లైఫ్ టైంలో అరుదుగా వస్తుంటుంది కాబట్టి ఒప్పుకోవచ్చు. విచిత్రం ఏమిటంటే భర్త సైఫ్ అలీ ఖాన్ ఆది పురుష్ లో రావణుడిగా చేస్తుంటే ఇటుపక్క కరీనా కపూర్ సీత పాత్ర వైపు చూస్తుండటం. ఇద్దరూ ఒకే సినిమా అయ్యుంటే ఆ కిక్ వేరుగా ఉండేది కానీ ఇలా జరగడం కాకతాళీయమే అయినా చెప్పుకోదగ్గ విశేషమే. మొత్తానికి బాలీవుడ్ లో రామజపం గట్టిగానే జరుగుతోంది. అయోధ్యలో రామమందిరం శంఖుస్థాపన జరిగాక ఈ తరహా సినిమాలు వేగమందుకోవడం విధి లిఖితమేనా