iDreamPost
iDreamPost
చాలా ఏళ్ళ క్రితం ప్రేమకథతో పరిచయమై సత్యం లాంటి సూపర్ హిట్, గౌరీ లాంటి కమర్షియల్ సక్సెస్ ఖాతాలో వేసుకుని కొంతకాలం తన ఉనికిని గట్టిగానే చాటుకున్న సుమంత్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ మధ్య మళ్ళీ రావాతో డీసెంట్ హిట్ ఖాతాలో వేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ చక్కగానే ప్రారంభించాడు. అయితే ఇదం జగత్, సుబ్రమణ్యపురంలు ఆశించిన ఫలితాలు అందుకోకపోవడంతో కథ మళ్ళీ మొదటికే వచ్చినట్టు అనిపించింది. అందుకే ఇప్పుడు తన ఆశలన్నీ రాబోయే కపటధారి మీదే ఉన్నాయి. డిసెంబర్ 25నే విడుదల చేద్దామనుకున్నారు కానీ వాయిదా వేసి ఇప్పుడు టీజర్ తో మళ్ళీ ప్రమోషన్ మొదలుపెట్టారు.
కన్నడ బ్లాక్ బస్టర్ కవలుదారికి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సుమంత్ ట్రాఫిక్ కానిస్టేబుల్ గా నటించాడు. ఒక ఫ్లై ఓవర్ కింద దొరికిన అస్థిపంజరాలను ఆధారంగా చేసుకుని ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగిన దారుణమైన హత్యలను శోధించే పనికి పూనుకుంటాడు. ఈ క్రమంలో ఒక సీనియర్ జర్నలిస్ట్(జయప్రకాశ్)ద్వారా కొన్ని విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. అంతే కాదు ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్(నాజర్) తనకు అడ్డు తగులుతాడు. అసలు ఇంతకీ ట్రాఫిక్ పోలీస్ కి తనకు సంబంధం లేని కేసు గురించి తెలుసుకోవాలని ఎందుకు ఉబలాటం కలిగింది, అసలు హంతకులు ఎవరు అనేది తెరమీదే చూడాలి.
ట్రైలర్ ఆసక్తికరంగా కట్ చేశారు. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ గతంలో చాలానే వచ్చినప్పటికీ ఇందులో కొంత ప్రత్యేకత ఉండటం వల్ల ఆసక్తి కలుగుతోంది. ఒరిజినల్ వెర్షన్ తీసిన ప్రదీప్ కృష్ణమూర్తినే దీనికి దర్శకత్వం వహించడం వల్ల ఒరిజినాలిటీ అలాగే వచ్చింది. రసమతి ఛాయాగ్రహణం, సైమన్ కింగ్ సంగీతం రెండూ సబ్జెక్టు మూడ్ కి తగ్గట్టు ఉన్నాయి. మొత్తానికి తన బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే కథతోనే సుమంత్ మరోసారి రాబోతున్నాడు. ఇది కనక కరెక్ట్ గా క్లిక్ అయితే మళ్ళీ ట్రాక్ లో పడొచ్చు. కపటధారి విడుదల తేదీ ఎప్పుడో ఇందులో ప్రకటించలేదు. ఫిబ్రవరిలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Trailer Link @ http://bit.ly/3siDFAg